విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన సర్పంచ్ వీర్ల నర్సింగరావు
శెనార్తిమీడియా, రామడుగు :
జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీలో శనివారం పిల్లల గ్రామసభ ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వీర్ల నర్సింగారావు, వార్డు మెంబర్లు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన పిల్లల గ్రామసభలో విద్యార్థులు గ్రామ సమస్యలు, పాఠశాలల్లో కావల్సిన సౌకర్యాలు, మంచినీరు, రోడ్లు, పారిశుధ్యం, ఆటస్థలం వంటి అంశాలపై సర్పంచును ప్రశ్నించగా, సర్పంచ్ నర్సింగారావు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు. విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన విద్యార్థులకు గ్రామంలో గ్రామసభలు ఎలా నిర్వహిస్తారు, ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తారనే విషయాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు చదువుతో పాటు సమాజంపై అవగాహన, ప్రశ్నించే విధానం ఉండాలని, నేటి బాలలే రేపటి పౌరులని, ప్రశ్నించడం నేర్చుకుంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. పిల్లల గ్రామసభ ద్వారా విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, భవిష్యత్తులో వారు బాధ్యతగల పౌరులుగా ఎదుగుతారని ఆయన ఆకాంక్షించారు.


