చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
శెనార్తిమీడియా, గంగాధర, రామడుగు :
ఇందిరమ్మ కుటుంబ బీమాతో ఆర్థిక భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్ జీపీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి చేరాలని ఆకాంక్షించారు. ఆపద సమయంలో కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు బీమా పథకం అండగా నిలుస్తుందని, గ్రామంలోని అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.

విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన
రామడుగు మండలం వెలిచాలలో 32/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిచాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే ఈ సబ్ స్టేషన్ మంజూరు చేయించామని పేర్కొన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తైతే లో వోల్టేజ్ సమస్య తొలిగిపోయి రైతులకు వ్యవసాయానికి, ప్రజలకు గృహావసరాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి పనులు వరుసగా చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రామడుగు ప్రత్యేకాధికారి బండి రాజేశ్వరి, ఎంపీడీవోలు సంగి రాజేశ్వరి, దమ్మని రాము, తహసీల్దార్లు అంబటి రజిత, దాసరి రాజమల్లయ్య, పీఏసీఎస్‌ల చైర్మన్లు ఒంటెల మురళీకృష్ణారెడ్డి, కోల రమేశ్, సర్పంచులు వేముల భాస్కర్, వీర్ల నర్సింగారావు, కాంగ్రెస్ పార్టీ గంగాధర, రామడుగు మండలాల అధ్యక్షులు మంత్రి మహేందర్, జవ్వాజి హరీష్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిరుత మంగ, మాజీ సర్పంచ్ కాడె శంకర్, నాయకులు జక్కుల బాబు, కృష్ణ, ట్రాన్స్ కో డీఈ శ్రీనివాస్, ఏడీఈ అనిల్, ఏఈ కమలేశ్వర్ పాల్గొన్నారు.

