- ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
- కనీస సౌకర్యాలు కరువు..
ప్లాట్‌ఫారాలపై ఆగని బస్సులు
శెనార్తి మీడియా, శంకరపట్నం:
కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న కేశవపట్నం బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ నిర్వహణపై ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచినీరు, సరైన లైటింగ్, బస్సుల రాకపోకల వివరాలు తెలిపే ట్రాఫిక్ గైడ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లో ఫ్రిజ్ ఉన్నప్పటికీ తాగునీరు అందుబాటులో లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
చీకట్లో భయం.. భద్రతపై ఆందోళన
రాత్రివేళల్లో బస్టాండ్‌లో సరైన లైటింగ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులే లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. గతంలో బ్యాగుల చోరీ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేస్తూ, రాత్రివేళల్లో బస్టాండ్‌లో వేచి ఉండాలంటే భయంగా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలకు తాగునీరు అందుబాటులో లేకపోవడం మరింత ఇబ్బందికరంగా మారింది.
ప్లాట్‌ఫారాలపై బస్సులు నిలిపేదెప్పుడు?
బస్సులను ప్లాట్‌ఫారాలపై నిలపకుండా దూరంగా ఆపుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో వృద్ధులు, మహిళలు బస్సులను చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్ఫారం నుంచి బస్సు వద్దకు వెళ్లేలోపే డ్రైవర్లు వాహనాలను ముందుకు తీసుకెళ్తున్నారని, బస్సుల వెనుక పరుగెత్తాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
అధికారులు స్పందించేనా?
కేశవపట్నం బస్టాండ్‌లో ట్రాఫిక్ గైడ్ ఏర్పాటు చేయడంతోపాటు నిరంతరం మంచినీరు అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. రాత్రివేళల్లో లైటింగ్ సౌకర్యం మెరుగుపరచాలని, బస్సులను తప్పనిసరిగా ప్లాట్ఫారాలపైనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్‌లోని సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.


