Wednesday, November 18, 2026
📄 ePaper
Homeతెలంగాణఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌ పేర్లు?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌ పేర్లు?

📰 Generate e-Paper Clip

  • తుది ఛార్జ్‌షీట్‌లో బీఆర్ఎస్‌ అగ్రనేతలపై అభియోగాలకు సిట్‌ సిద్ధం
  • కేసీఆర్‌ను ఏ1గా, కేటీఆర్‌ను ఏ2గా పేర్కొంటున్నట్లు ప్రచారం
  • హరీశ్‌రావు, నవీన్‌రావుల పేర్లపైనా చర్చ
  • 618 ఫోన్‌ నంబర్లు, 2,500 సంభాషణలపై నిఘా పెట్టినట్లు గుర్తింపు

శెనార్తి మీడియా డెస్క్ :

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు రాజకీయ నాయకత్వం దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిట్‌ రూపొందిస్తున్న తుది అదనపు ఛార్జ్‌షీట్‌లో బీఆర్ఎస్‌ అగ్రనేతల పేర్లు ఉండవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును ఏ1గా, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏ2గా పేర్కొంటూ అభియోగపత్రం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి టి. హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కె. నవీన్‌రావుల పేర్లు కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చే అవకాశముందని సమాచారం. అయితే ఈ వివరాలపై అధికారిక ధ్రువీకరణ వెలువడాల్సి ఉంది.

618 ఫోన్‌ నంబర్లపై నిఘా

ఈ కేసులో ఇప్పటివరకు మాజీ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ టి. ప్రభాకర్‌రావుతో పాటు ఆరుగురు పోలీసు అధికారుల పాత్రపై ప్రధానంగా దర్యాప్తు కొనసాగింది. తాజాగా విచారణను అప్పటి రాజకీయ నాయకత్వం వరకు విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఎస్‌ఐబీలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి రాజకీయ ప్రత్యర్థులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులకు సంబంధించిన 618 ఫోన్‌ నంబర్లను ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. సుమారు 2,500 సంభాషణలను పర్యవేక్షించినట్లు ఫోరెన్సిక్‌ నివేదికల్లో వెల్లడైన అంశాల ఆధారంగా సిట్‌ అదనపు అభియోగపత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హరీశ్‌రావుపై మరో ఎఫ్‌ఐఆర్‌

ఇదిలా ఉండగా, సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో హరీశ్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తదితరులపై క్రైమ్‌ నంబర్‌ 496/2026తో కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామంపై హరీశ్‌రావు స్పందిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసును 18 నెలల తర్వాత మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఉన్న కేసును సిద్దిపేటకు బదిలీ చేసి కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ప్రభుత్వ జోక్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలు, భూకబ్జా ఆరోపణలపై ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్‌ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్ని కేసులు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, న్యాయస్థానాల్లోనే ఆరోపణలను ఎదుర్కొంటామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. మరోవైపు, దర్యాప్తులో లభించిన ఆధారాల ప్రకారమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికార పక్షం చెబుతోంది.

ఛార్జ్‌షీట్‌పై ఉత్కంఠ

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రాజకీయ నేతలపై వస్తున్న ఆరోపణలు కోర్టులో నిరూపితం కావాల్సి ఉంది. సిట్‌ సమర్పించే సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్‌ నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలు న్యాయస్థానంలో ఎంతవరకు నిలబడతాయన్నది కీలకం కానుంది. తుది అదనపు ఛార్జ్‌షీట్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుల పేర్లు అధికారికంగా చేరితే రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం మరింత చర్చకు దారితీయనుంది. దర్యాప్తు తుది నివేదిక, తదుపరి న్యాయపరమైన పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.