Thursday, November 19, 2026
📄 ePaper
Homeతెలంగాణఆన్‌ డ్యూటీ.. ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ!

ఆన్‌ డ్యూటీ.. ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ!

📰 Generate e-Paper Clip

  • విధులకు హాజరైనట్లు రిజిస్టర్లలో సంతకాలు చేసి వేడుకలకు వెళ్లిన బెల్లంపల్లి వన్‌టౌన్‌ పోలీసులు     
  • కత్తెర్ల ఫామ్‌హౌస్‌లో మద్యం విందు.. రెయిన్‌ డ్యాన్స్‌లు
  • మహిళా పోలీసులు సహా 12 మంది పాల్గొన్నట్లు ప్రాథమిక గుర్తింపు
  • వీడియోలు వైరల్‌ కావడంతో విచారణకు ఆదేశించిన రామగుండం సీపీ

ప్రజల రక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన పోలీసు సిబ్బంది విధులను విస్మరించి ప్రైవేట్‌ వేడుకల్లో పాల్గొనడం మంచిర్యాల జిల్లాలో వివాదానికి దారితీసింది. బెల్లంపల్లి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పలువురు సిబ్బంది విధులకు వచ్చినట్లు రిజిస్టర్లలో సంతకాలు చేసి, అనుమతి లేకుండానే పుట్టినరోజు వేడుకకు వెళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తాండూరు మండలం కత్తెర్ల సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ వేడుకలో మద్యం సేవించడంతో పాటు రెయిన్‌ డ్యాన్స్‌లు, స్విమ్మింగ్‌ పూల్‌లో ఆటపాటలతో గడిపారు. మహిళా పోలీసు సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

విధుల నమోదు.. పార్టీకి హాజరు

బెల్లంపల్లి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు, మహిళా సిబ్బంది ముందస్తు అనుమతులు తీసుకోకుండానే స్టేషన్‌ పరిధి దాటి వెళ్లినట్లు సమాచారం. విధులకు హాజరైనట్లు రిజిస్టర్లలో నమోదు చేసుకున్నప్పటికీ, బయటకు వెళ్లిన విషయాన్ని మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో పొందుపరచలేదని తెలుస్తోంది. కత్తెర్ల వద్ద ఫామ్‌హౌస్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకకు చేరుకున్న సిబ్బంది మద్యం విందులో పాల్గొన్నారు. అనంతరం రెయిన్‌ డ్యాన్స్‌లు చేస్తూ, స్విమ్మింగ్‌ పూల్‌లో నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

వైరల్‌గా మారిన పోలీసుల జల్సా దృశ్యాలు

పోలీసుల వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం పొదుపుగా నీటిని వినియోగించాలని సూచిస్తున్న తరుణంలో, విధుల్లో ఉన్న సిబ్బంది నీటితో కూడిన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల భద్రతను పర్యవేక్షించాల్సిన సిబ్బంది బాధ్యతలను పక్కనపెట్టి పార్టీకి వెళ్లడంపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి.

బాధ్యులపై చర్యలకు సీపీ ఆదేశం

ఈ ఘటన రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 12 మంది పోలీసు సిబ్బంది వేడుకకు హాజరైనట్లు గుర్తించారు. ఈ జాబితాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? పార్టీ నిర్వహణకు ఎవరి అనుమతి ఉంది? సిబ్బంది ఆ సమయంలో విధుల్లో ఉన్నారా, సెలవులో ఉన్నారా? అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణలో వెల్లడయ్యే వివరాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీపీ స్పష్టం చేశారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల

police-duty-negligence
police-duty-negligence

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.