Thursday, November 19, 2026
📄 ePaper
Homeతెలంగాణలంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

📰 Generate e-Paper Clip

  • రూ.1.50 లక్షలు స్వాధీనం.. మరో వ్యక్తి అరెస్ట్
  • పెద్దపల్లి కోర్టులో సాక్షుల విచారణకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్

    శెనార్తి మీడియా, పెద్దపల్లి:
    అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ చిక్కారు. ఓ కేసులో నిందితులకు అనుకూలంగా సాక్షుల విచారణ జరిగేలా చూడటంతోపాటు కేసులో నిర్దోషులుగా విడుదలయ్యేలా సహకరించేందుకు రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేటు వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్యను కూడా అరెస్ట్ చేశారు.

    ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ తొలుత రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి విజ్ఞప్తితో ఆ మొత్తాన్ని రూ.1.50 లక్షలకు తగ్గించారు. ధర్మారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 12/2023 కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా సాక్షుల విచారణ జరిపించి, చివరకు నిర్దోషులుగా విడుదలయ్యేలా సహకరించేందుకు ఈ మొత్తం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి నుంచి ఏ-2 రెడ్డిరాజుల రాజయ్య ద్వారా ఏ-1 రవీందర్ లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

    రాజయ్య ప్యాంటు ఎడమ జేబులో నుంచి రూ.1.50 లక్షల లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి రెండు చేతుల వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయి. అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ గుర్తించింది.

    ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.

    ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.