- హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలం
- గన్నేరువరంకు కవ్వంపల్లి చేసిందేమీలేదు
- స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్‌దే గెలుపు
- కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి
Rasamai: హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రమసయి బాలకిషన్ అన్నారు. బుధవారం గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రసమయి బాలకిషన్ పాల్గొని మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. అడ్డగోలు హామీలు, అబద్ధపు మాటలతో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పండగలా మారిస్తే.. మోసకారి కాంగ్రెస్ వ్యవసాయాన్ని దండగలా మార్చిందన్నారు.
రేవంత్ రెడ్డి పాలనలో రుణమాఫీ జరగకా అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ మండిపడ్డారు. తమ హాయాంలో 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటును సరఫరా చేశామని, కాంగ్రెస్ హాయాంలో నిత్యం కరెంటు కోతలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రేవంత్ పాలన 420 హామీలతో, 420 అబద్ధాలతో సాగుతుందని మండిపడ్డారు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గన్నేరువరం మండలంలో జెడ్పీటీసీ స్థానంతో పాటు అత్యధికంగా ఎంపీటీసీలు గెలవబోతున్నారని రసమయి బాలకిషన్ జోస్యం చెప్పారు. పార్టీలో ఎలాంటి విభేదాలకు తావులేకుండా, అంతర్గత కలహాలను పక్కన పెట్టి పార్టీ పటిష్టతకు పాటుపడాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ అభ్యర్థులు గెలిస్తే తాను గెలిచినట్టేనని రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గన్నేరువరం మండలానికి చేసిందేమీ లేదని , ఆయన అనుచరులు వసూళ్లకు పాల్పడుతున్నారని రసమయి ఆరోపించారు.
గన్నేరువరం ను నూతన మండలంగా ఏర్పాటు చేసి కాళేశ్వర జలాలను తీసుకొచ్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా కవ్వంపల్లి సత్యనారాయణ ప్రతిపక్షాలపై కాకుండా పాలనపై ఫోకస్ చేయాలని రసమయి సూచించారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మాడుగుల రవీందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ న్యాత స్వప్న- సుధాకర్ తో పాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, కరీంనగర్(గన్నేరువరం)