- అడ్మిషన్లు ఇప్పిస్తామంటూ వేలాది రూపాయల వసూళ్లు
- తల్లిదండ్రుల ఆగ్రహం
Gurukula Scam: పెద్దపల్లి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల్లో సీట్ల కోసం భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచితంగా విద్యను అందించాల్సిన ఈ గురుకులాలు దళారుల చేతుల్లో వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో దళారులు ఆ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని సమాచారం. ఒక్కో సీటు కోసం రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత లేని విద్యార్థులకు కూడా డబ్బు చెల్లిస్తే సీట్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తల్లిదండ్రులు చెబుతున్న వివరాల ప్రకారం, మొదట అధికారిక ప్రక్రియ చూపించి తరువాత దళారీ ద్వారా సంప్రదింపులు జరుపుతారు. ముందుగా నిర్ణయించిన మొత్తం చెల్లించిన వెంటనే సీటు కేటాయింపు ఆర్డర్ అందుతుందని వారు అంటున్నారు.
స్థానికులు చెబుతున్నట్లుగా “దళారి ఒక్కడే కాదు, లోపల కూడా సహకారం లేకపోతే ఇది సాధ్యం కాదు. అదే అసలు ప్రమాదం.” పేద తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేయడం, ఆభరణాలు అమ్మడం వరకు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసీటు ఒక అవకాశం కాకుండా వేలంపాటగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విద్య హక్కు అని చెప్పే ప్రభుత్వం ఈ వ్యవహారంపై మౌనం వహించడం ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. “బాధ్యులు ఎవరు? చర్యలు ఎందుకు లేవు?” అన్న ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం లేదు. “దళారులను కాదు, వారికి అవకాశం కల్పించిన వారినే గుర్తించి చర్యలు తీసుకోవాలి” అని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా విద్యాధికారులు, గురుకులాల పర్యవేక్షణ సంస్థలు తక్షణ విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మా దృష్టికి రాలేదు..
మణిదీప్తి, బీసీ గురుకుల కో ఆర్డినేటర్
బీసీ గురుకులాల్లో సీట్ల పేరుతో దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఇప్పటివరకు మా దృష్టికి రాలేదని పెద్దపల్లి జిల్లా బీసీ గురుకుల కో ఆర్డినేటర్ మణిదీప్తి తెలిపారు. “ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మా పరిధిలోని ఎంజేపీ గురుకులాల్లో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు, రాష్ట్ర కార్యదర్శి అనుమతితోనే సీట్ల భర్తీ జరుగుతుంది. సీట్లు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలను నమ్మి తల్లిదండ్రులు మోసపోవద్దు” అని ఆమె సూచించారు.
– శెనార్తి మీడియా, కరీంనగర్/పెద్దపల్లి
