ACB enquiary: సబ్ రిజిస్ట్రార్ ప్రియాంకను విచారిస్తున్న ఏసీబీ అధికారులు
ACB enquiary: సబ్ రిజిస్ట్రార్ ప్రియాంకను విచారిస్తున్న ఏసీబీ అధికారులు

ACB Raids: ఏసీబీ సోదాలతో మంచిర్యాల రిజిస్ట్రార్‌లో కుదుపు

  • డాక్యుమెంట్ రైటర్ల ఫోన్ నెంబర్లు, షాపుల ఫొటోలు తీసిన అనిశా అధికారులు
  • రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారు ఇచ్చిన సమాచారంతో ఆరా
  • రాత్రి 8 గంటల వరకు ఫైళ్ల పరిశీలన
  • ఫోన్ల ద్వారా డాక్యుమెంట్ రైటర్ల నుంచి కూపీ లాగుతున్న ఆఫీసర్లు
  • వినియోగదారుల్లా నటించి జారుకున్న కాంట్రాక్టు ఉద్యోగులు?

ACB Raids: మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ చేపట్టిన సోదాలు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా హడలెత్తించాయి. ఉపాధ్యక్షతలో నడిచిన ఈ దర్యాప్తు, అక్కడ నెలకొన్న అవకతవకలపై గత కొన్ని రోజులుగా సేకరించిన ఇంటలిజెన్స్ ఆధారంగానే కొనసాగినట్లు విశ్వసనీయ సమాచారం.

వినియోగదారుల నుంచి కీలక సమాచారం
సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన పలువురి వద్ద ఏసీబీ అధికారులు నేరుగా వివరాలు సేకరించారు. “ఎంతకు భూమి కొనుగోలు చేశారు? బ్యాంక్ చలాన్ ఎంత? డాక్యుమెంట్ ఫీజు ఎంత?” — ఇలా ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ వారి వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్లపై రాసిన ఫోన్ నెంబర్లను ఆధారంగా తీసుకుని డాక్యుమెంట్ రైటర్ల నెంబర్లను సేకరించి, షాపులకు వెళ్లి ఫొటోలు తీశారు. ఈ ప్రక్రియ ఏసీబీ దర్యాప్తు దిశ ఎంత లోతుగా సాగుతోందో స్పష్టం చేసింది. బయట ఉన్న డాక్యుమెంట్ రైటర్ల షాపులపై ఉన్న ఫోన్ నెంబర్లను లోపల కస్టమర్లు ఇచ్చిన డాక్యుమెంట్ల నెంబర్లతో పోల్చి కొన్ని కాల్స్ చేసినట్లు సమాచారం.

ఏసీబీ కార్యాలయానికి సబ్ రిజిస్ట్రార్ ప్రియాంక
సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ ప్రియాంకను ఏసీబీ అధికారులు ప్రశ్నల కోసం డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఇది సాధారణ తనిఖీ కాదని, ముందుగా సేకరించిన నిర్దిష్ట సమాచారంతోనే ఈ చర్య జరిగినట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు రామగుండం కార్పొరేషన్ పరిధిలో పనిచేసిన సమయంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు వచ్చిన విమర్శలు ఈ దర్యాప్తుకు మరింత బలం ఇచ్చాయి. ఆమె సెలవులో ఉన్న రోజుల్లో రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయన్న అంశంపై కూడా ఏసీబీ ప్రత్యేకంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

మెల్లగా జారుకున్న కాంట్రాక్టు ఉద్యోగులు
సోదాలు మొదలైన వెంటనే కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు ఒక్కొక్కరూ సాధారణ కస్టమర్లుగా బయటకు జారుకున్నారు. “భూమి కొనుగోలుకు వచ్చాం… పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాం…” అంటూ తప్పించుకోవడం ఏసీబీ విచారణను మరింత ఆసక్తికరంగా మార్చింది. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తే వారి పాత్రలు బయటపడే అవకాశాలున్నాయని చర్చ సాగుతున్నది. ఇదే సమయంలో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు, కాంట్రాక్టు ఉద్యోగులతో కలిసి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు కొత్త కాదు. ఈ నేపథ్యంలో వచ్చిన ఏసీబీ దాడులు వ్యవస్థను అంతర్భాగం వరకూ కుదిపినట్లు కనిపిస్తోంది.

అటెండర్ గౌస్ పరారీ ప్రయత్నం

ACB Raids: పారిపోయేందుకు యత్నించిన అటెండర్ గౌస్
ACB Raids: పారిపోయేందుకు యత్నించిన అటెండర్ గౌస్

అటెండర్ గౌస్ ఏసీబీ అధికారులను చూసి బయటికి పరుగులు పెట్టడం మరో అంశంగా నిలిచింది. ఎందుకు పరారయ్యాడనే ప్రశ్నలు తలెత్తాయి. అతని వద్ద ఏమైనా నగదు లేదా పత్రాలు ఉన్నాయా? ఏసీబీ ఇంకా ఏ వివరాలూ ప్రకటించకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అతని పరుగుపెట్టడం చూడగానే దస్తావేజు కార్యాలయం వద్ద ఉన్న షాపులు ఒక్కసారిగా మూతపడటం గమనార్హం.

సాధారణ తనిఖీలే : ఏసీబీ
సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపినా, వారి చర్యల తీరుతో ఇది ముందే సిద్ధమైన దర్యాప్తు అన్న సందేశం స్పష్టమవుతోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్లాట్ బుకింగ్, డాక్యుమెంటేషన్ — ప్రతి అంశంలో వారు చేసిన క్రాస్‌ వెరిఫికేషన్ ఈ సోదాలు యాదృచ్ఛికం కాదని వెల్లడిస్తోంది.

డాక్యుమెంట్ రైటర్లలో గుబులు
షాపుల ఫొటోలు తీయడం, ఫోన్ నెంబర్లను సేకరించడం, కస్టమర్ల డాక్యుమెంట్లను పోల్చడం — ఇవన్నీ చూసి డాక్యుమెంట్ రైటర్లు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా భయాందోళనకు గురయ్యారు.

ACB Raids: ఏసీబీ అధికారుల రాకతో మూసివేసిన డాక్యుమెంట్ రైటర్ల షాపులు
ACB Raids: ఏసీబీ అధికారుల రాకతో మూసివేసిన డాక్యుమెంట్ రైటర్ల షాపులు

శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *