ACB Raids: మంచిర్యాల జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏసీబీ బృందం అకస్మిక దాడులు నిర్వహించడంతో జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. అనుమానాస్పద లావాదేవీలపై అందిన సమాచారంతో అధికారులు రికార్డులు, ఫైళ్లను సోదా చేసి పత్రాలను పరిశీలించారు. అక్రమ సేవల కోసం లంచాలు తీసుకున్నారనే ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు నిర్వహించామని ఏసీబీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

దాడుల సమాచారం తెలిసిన వెంటనే మంచిర్యాల, పరిసర ప్రాంతాల్లోని పలు దస్తావేజు లేకరుల కార్యాలయాలు తొందరగా మూతపడ్డాయి. తనిఖీలు కొనసాగుతున్న సమయంలో సంబంధిత ఉద్యోగుల నుండి ప్రాథమిక వాంగ్మూలాలు సేకరించగా, పత్రాల పరిశీలనను ఏసీబీ బృందం వేగవంతం చేసింది.
ఏసీబీ అధికారుల రాకతో అటెండర్ పరార్

తనిఖీల కోసం ఏసీబీ బృందం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకోగానే అక్కడ విధుల్లో ఉన్న అటెండర్ గౌస్ ఒక్కసారిగా పారిపోవడం కలకలం రేపింది. ఒక సాధారణ అటెండర్ ఇంత భయంతో అక్కడి నుంచి పరారవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకుని మంచిర్యాల ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఒక సాధారణ అటెండర్ ఏసీబీ అధికారులను చూసి పారిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది
లంచం పేరుతో ఎవరైనా ఒత్తిడి చేస్తే వెంటనే ఏసీబీ హెల్ప్‌లైన్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
