- ఉత్కంఠ పోరులో ఓటమి పాలు
- కన్నీరు మున్నీరైన ఆల్పోర్స్ వీ ఎన్ ఆర్
MLC RESULT EFFECT : ఉత్కంఠభరితంగా సాగిన కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ – నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎం ఎల్ సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనూహ్యంగా ఓటమి చవిచూశారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు సాధిస్తారని ఆశించిన ఆయన, చివరకు నిరాశలో మిగిలిపోయారు. మూడో స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ అనంతరం గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయాన్ని సాధించారు.
కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులతో పాటు అనుచరుల్లోని కొందరు నరేందర్ రెడ్డికి గట్టిగానే వెన్నుపోటు పోడిచారనే చర్చ జరుగుతున్నది. ప్రచారానికి వెంట వచ్చిన అనుచరుల్లో కొంత మంది తమ పరిధిలో ఇంత మంది ఓటర్లు ఉన్నామని, ఓట్లు వేయిస్తామని నమ్మించి, డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. తీరా పోలింగ్ రోజు అతని అనుచరులు డబ్బులు ఇవ్వకుండా జారుకున్నారనే గుసగుసలు వినిపించాయి. చివరి నిమిషంలో ఇది మరింత ప్రభావం చూపిందనే టాక్ నడిచింది.
ఆఖరి వరకూ పోరాడినా ఫలితం విరుద్ధం…
ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న కొద్దీ నరేందర్ రెడ్డి ఆశలు మంటగలిశాయి. తొలి రౌండ్ నుంచే రెండో స్థానంలో నిలిచిన ఆయన, మూడు రౌండ్లలో స్వల్ప ఆధిక్యం సాధించినా, చివరకు అంజిరెడ్డి ఓట్లను అధిగమించలేకపోయారు. ఏదైనా ఒక రౌండ్‌లో గణనీయమైన ఆధిక్యం వస్తే ఫలితాలు తారుమారు కావొచ్చని భావించిన ఆయన, చివరకు తన అంచనాలను నిజం చేసుకోలేకపోయారు.

కన్నీటి పర్యంతమైన నరేందర్ రెడ్డి…
ఎన్నికల అధికారులు అధికారికంగా ఫలితాలు ప్రకటించిన వెంటనే, ఆల్పోర్స్ వీ నరేందర్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయనను సన్నిహితులు ఓదార్చే ప్రయత్నం చేశారు. తీవ్రంగా శ్రమించినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోవడం ఆయనను ఎంతగానో కలచివేసిందని పలువురు సన్నిహితులు చర్చించుకుంటున్నారు.
ప్రచారంలో విమర్శలు – ఫలితాలపై ప్రభావం…
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే నరేందర్ రెడ్డిపై విమర్శలు ఊపందుకున్నాయి. విద్యా సంస్థల నిర్వహణలో ఆయన వ్యవహారశైలిపై వచ్చిన ఆరోపణలు ఆయన ప్రచారాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ, వ్యతిరేకతను సానుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేశారు. కరీంనగర్‌లో ఓట్లు రావని ప్రచారం జరిగినా, చివరి వరకు పోరాడి టఫ్ ఫైట్ ఇచ్చారు.
కాంగ్రెస్‌కు అనూహ్య ఫలితం.. ఆత్మపరిశీలన తప్పదు..
ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఊహించని రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. విజయం దాదాపుగా ఖాయమని భావించిన ఓ కీలక స్థానంలో, చివరి నిమిషంలో ఓటమిని ఎదుర్కోవడం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. నరేందర్ రెడ్డి ఓటమి కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతే కారణమా..?
కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకత కూడా వీ ఎన్ ఆర్ ఓటమికి కారణం అనే ప్రచారం సైతం పెద్ద మొత్తంలో జరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి ఎం ఎల్ సీ ఎన్నికలకు ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి చవిచూడటాన్ని చూస్తే అది నిజమేననిపిస్తోంది. మరోవైపు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం.. ఎం ఎల్ సీ ఎన్నికల ఫలితాలు రానున్న స్థానిక సంస్థల ఫలితాలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
– శెనార్తి మీడియా, పొలిటికల్ డెస్క్: