- అప్రమత్తమైన అటవీ శాఖ.. ప్రమాదాన్ని నివారించిన సిబ్బంది
Gattu Mallanna: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గుట్టపై బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గట్టు మల్లన్న జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో, గుర్తుతెలియని వ్యక్తుల నిర్లక్ష్యంతో అడవిలో మంటలు చెలరేగాయి. రాత్రి విధుల్లో ఉన్న వేలాల బీట్ అధికారి శ్రీధర్ ఈ పరిస్థితిని గమనించి, వెంటనే తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్ డి) వాచర్ సాయికిరణ్‌ను ఫైర్ బ్లోయర్ (Fire Blowyer)తీసుకురావాలని ఆదేశించారు. అప్రమత్తమై స్పందించిన అటవీ సిబ్బంది, తక్షణమే మంటలను అదుపు చేసి ప్రమాదాన్ని నివారించారు.
ఈ ఘటనపై ఎఫ్ఎస్ఓ భగవంత్ రావు(FSO Bhagavanth Rao) స్పందిస్తూ, మంటలు అదుపు చేయకపోతే అడవికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అలాగే జాతరకు వచ్చిన భక్తుల ప్రాణాలకు ముప్పుగా మారేదని తెలిపారు. విధి నిర్వహణలో చూపిన జాగ్రత్త కోసం బీట్ అధికారి శ్రీధర్, వాచర్ సాయికిరణ్‌లను మంచిర్యాల రేంజ్ ఎఫ్ఆర్ఓ (FRO) రత్నాకర్ (Rathnakar Rao) రావు, టీజీఎఫ్ డి ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్ అభినందించారు.
అటవీశాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేస్తూ, అడవిలో వంటలు చేసిన తర్వాత మంటలను పూర్తిగా ఆర్పాలని, అలాగే బీడీలు, చుట్టలు నిర్లక్ష్యంగా పారవేయొద్దని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణ అందరి బాధ్యతని గుర్తించి సహకరించాలని కోరారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
