- సిరికొండలో బ్యాంకు అధికారుల నిర్వాకం
- బ్యాంకు ఎదుట బోరున విలపించిన మహిళ
Bankers Mistake:పంట రుణం చెల్లించలేదని బ్యాంకు అధికారులు కల్యాణ లక్ష్మి డబ్బులను అప్పు చెల్లింపు కింద జమ చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ సోంబాయి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటోంది. గత ఏడాది ఆమె అప్పులు చేసి తన కుమార్తె వివాహాన్ని జరిపించింది. అప్పులను తీర్చడానికి కల్యాణలక్ష్మి పథకం డబ్బులపై ఆశలు పెట్టుకుంది.
కానీ, ఆ డబ్బులు బ్యాంకులో జమ అయ్యే సరికి ఆమె ప్రమేయం లేకుండా తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది వాటిని పంటరుణంగా జమ చేసుకున్నారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్థాపానికి గురైన సోంబాయి, బ్యాంకు ఎదుట బోరున ఏడుస్తూ కూర్చొంది.
సోంబాయి రెండేళ్ల క్రితం బ్యాంకు నుంచి రూ.1.60 లక్షల రుణం తీసుకుంది. వడ్డీతో కలిపి రూ.2.20 లక్షలు బకాయి ఉందని అధికారులు తెలిపారు. అనుభవలేమితో రెన్యువల్ చేసుకోలేదు సోంబాయి. ఈ విషయం గురించి తనకు ఎవరూ చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం బ్యాంకు అధికారులకు తెలిసినా ఆమె విషయంలో అధికారులు కాస్త కూడా కనికరం చూపలేదు. కల్యాణలక్ష్మి డబ్బులను మాత్రం పంట రుణం కింద జమ చేసుకున్నారు. ఆదివాసీ మహిళలను చైతన్యవంతం చేయడం అవసరమని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.
శెనార్తి మీడియా, ఆదిలాాబాద్