- మిల్లుకు తరలించినా నాణ్యత పేరిట కోత…
- ఏఈవో ల ధ్రువీకరణ లేకుండానే తూకం…
- నష్టపోతున్న రైతాంగం…
PADDY PROCUREMENT : జిల్లాలో వరి ధాన్యం కోతలు ఒకవైపు ప్రారంభం కాగా మరోవైపు అదే స్థాయిలో మిల్లుకు తూకం వేసి పంపిన ధాన్యంలో కోతలు సర్వసాధారణమయ్యాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు 321 కేంద్రాలను కేటాయించారు. కొన్నింటిలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో కాకుండా మమా అనిపిస్తున్నారు. దీనితో ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు.

తేమ 10 శాతానికి తగ్గినా…!
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి రెండు వారాలు దాటుతుండటం, ఎండలు దంచి కొడుతుండటంతో ధాన్యం తేమ శాతం 10 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వ నియమాల ప్రకారం 17 శాతం కంటే ధాన్యం తేమ తగ్గితే వెంటనే తూకం వేసి మిల్లుకు తరలించాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. రోజుల తరబడి కల్లాల్లోనే ఉండి పోతుంది. రైతులు కేంద్రాల నిర్వాహకుల చుట్టూ తిరిగినా కాంటా వేసేందుకు వెనుకాడుతుండటంతో పొద్ధాంత కల్లంలోనే ఉండాల్సి వస్తోందని, పొద్దుగూకిన తర్వాతే ఇంటికి పోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. కొన్ని కేంద్రాలలో అసలు నిర్వాహకులే ఉండకపోవడం, కేంద్రానికి వచ్చిన రైతులకు సమాధానాలు చెప్పేవారు, వారి సీరియల్ నెంబర్ రాసుకునే వారే లేకపోవడంతో ఏంచేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. గట్టిగా అడిగితే లేనిపోని నిభందనలు పెట్టి తిప్పలు పెడతారని భయానికి చెప్పేందుకు జంకుతున్నారు.
మిల్లులకు తరలించినా నాణ్యత పేరిట కోత…
కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని తూర్పార పట్టినప్పటికి మిల్లు యజమానులు తాలు, తప్ప ఉందంటూ కోతలు విధించడం మొదలు పెట్టారు. కొందరు మిల్లు యాజమానులయితే జల్లెడ పట్టినా బస్తా 42 కిలోలకంటే తక్కువ ఉంటే పంపించవద్దని కేంద్రం నిర్వాహకులకు ఫోన్లు చేసి చెబుతున్నారు. మరో వైపు నాయకులు సైతం మిల్లర్లకే వత్తాసు పలుకుతూ ఈ ఒక్క సీజన్ మిల్లర్లు అడిగింది ఇచ్చేయండి.. ముందు ఎలక్షన్లు ఉన్నాయి, పార్టీని బధనాంచేయకండి, వచ్చే సీజన్ లో ఏమైనా ఉంటే చూసుకుందాం అంటూ ఉచిత సలహాలు ఇవ్వడం పట్ల రైతులు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. నాయకుల మాటలతో కష్టపడి పండించిన ధాన్యం అమ్మబోతే అడివిలా.. అమ్మకపోతే కొరివిలా.. తయారయ్యింది మా బతుకంటూ బహటంగానే రైతులు వాపోతున్నారు.

ఏఈవోల ధ్రువీకరణ లేకుండానే తూకం…
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రాథమిక స్థాయిలో ఆయా వ్యవసాయ క్లస్టర్ల ఏఈఓలు పరిశీలించిన తర్వాతే తూకం వేయాలనే నిబంధన సంబంధిత శాఖ జిల్లా స్థాయి అధికారులు విధించినప్పటికి, అవేమి పట్టించుకోకుండా కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తుండటంతో రైతులకు నష్టం తప్పడం లేదు. మిషన్ లో పోసి తాలు, తప్ప లేకుండా పంపించినా కూడా ఏ ఈ ఓల ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో బస్తాకు రెండు కిలోల చొప్పున కోత విధిస్తున్నారని పేరు చెప్పేందుకు ఇష్టపడని రైతులు అక్కడికి వెళ్లిన ‘శెనార్తి మీడియా’ విలేకరికి వివరించారు. ఏదీ ఏమైనా అధికారులు తిరిగితేనే క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలు తెలుస్తాయనేది గుర్తించి కాళ్లకు పదునుపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :