ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్

Balks Suman: ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ పాలన

  • కొట్లాటలు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
  • మాటలతో కాలం గడుపుతున్న చెన్నూర్ ఎమ్మెల్యే
  • ఇసుక దందా, గంజాయి దందాను అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలం
  • ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్

Balks Suman: 16 నెలల కాంగ్రెస్ పాలన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని మాజీ ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శించారు. మంచిర్యాలలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పనితీరుపై ఘాటు విమర్శలు చేశారు. అధికారం కోస ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, రానున్న రోజుల్లో హస్తం పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దాడికి దిగుతుందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడం వీలు కాకపోడంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏడాదిన్నర కాలంలోని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్ష పార్టీపై విమర్శలకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలుసన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎటువంటి అభివృద్ధిని చేయకుండా కేవలం మాటలకే పరిమితమవుతోందన్నారు. రైతుల కోసం బీఆర్‌ఎస్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. రెండు లక్షల రుణ మాఫీ చేసి రైతులకు అండగా నిలిచిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. అర్థంలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

చెన్నూర్ లో మైనింగ్, ఇసుక మాఫియా హవా
చెన్నూర్ నియోజకవర్గంలో మైనింగ్, ఇసుక దందాలు శృతిమించాయని ఆరోపించారు. ‘‘వందలాది లారీల ఇసుక అక్రమంగా తరలిపోతుందని, అధికారులు నిష్క్రియగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మైనింగ్ కళాశాల ఏమయ్యిందని ప్రశ్నించారు. మద్యం, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా గంజాయి దందాకు అడ్డాగా మారిందని, ఇంత జరుగుతున్నా. పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.

చెన్నూర్ ఎమ్మెల్యే పై తీవ్ర విమర్శలు
‘‘చెన్నూర్ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. అభివృద్ధి పనులు ఏవీ చేపట్టకుండా, మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే, ప్రజలు సమయానుకూలంగా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కాంగ్రెస్‌లో కొట్లాటలు… అవినీతి పరాకాష్ట
జిల్లాలోని ‘‘ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం కోట్ల రూపాయల గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. అధికార యంత్రాగం అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నదని ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్నా, అవినీతి అడ్డుకోకుండా అధికారులు మౌనంగా ఉండటం శోచనీయమని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ మాత్రమే నిజమైన ప్రజాపక్షం
‘‘బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. మూడు ప్రాజెక్టులు ఎండిపోవడంతో రైతులు కొత్తగా బోర్లు వేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకోలేని ప్రభుత్వం ఏమి చేస్తుందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని బాల్క సుమన్ ఆశాభావం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ యువ నాయకుడు నడిపెల్లి విజిత్ రావు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *