Minister Seethakka :ములుగు జిల్లా బండారుపల్లికి చెందిన రవళిక ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సమయంలో బిడ్డను కోల్పోయిన ఘటనపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. ప్రస్తుతం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవళికను మంత్రి సీతక్క స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి తెలుసుకుని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఘటన బాధాకరమైందని మంత్రి పేర్కొంటూ, బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రవళిక చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. బాధితురాలికి న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చట్టపరంగా తీసుకునే చర్యలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
శెనార్తి మీడియా, హనుమకొండ