- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
Awareness: పాఠశాలల, కళాశాలల విద్యార్థుల భవిష్యత్తుపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో మాదకద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత అంశాలపై డీసీపీ భాస్కర్, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస్ రావు, జిల్లా ఆబ్కారీ-మధ్యనిషేధ శాఖ అధికారి నందగోపాల్ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలల స్థాయిలో ప్రహారీ క్లబ్స్ నిర్వహించడం జరుగుతుందని, బుధవారం పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
మాదకద్రవ్యాలు, గంజాయి ఇతరత్రా మత్తుపదార్థాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలను అర్థమయ్యేలా ర్యాలీలు, వ్యాసరచన, చిత్రలేఖనం, క్లబ్ల ఏర్పాట్లు ఇతర వివిధ రకాల పద్ధతుల ద్వారా అవగాహన కల్పించాలని, మానసిక వైద్య నిపుణులచే శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మాదకద్రవ్యాలు నియంత్రించడంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమైనదని, విద్యార్థుల అసాధారణ ప్రవర్తనను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డ్రగ్స్ రిహాబిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు., బాధితులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు . మందుల దుకాణాలు, వైద్యశాలల్లో అందించే గుర్తించిన ప్రత్యేకమైన డ్రగ్స్పై రిజిస్టర్ నిర్వహించాలని, వైద్యుల సూచన మేరకు మాత్రమే మందులు విక్రయించాలని, మత్తు మందుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో గంజాయి సాగు చేయకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు. చట్ట విరుద్దంగా మద్యం, గంజాయి, సిగరెట్లను విక్రయించే లైసెన్స్ లేని దుకాణాలను సీజ్ చేయాలని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో అధికార యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని తెలిపారు.
రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ద్విచక్ర వాహదారులు హెల్మెట్, కారు, ఇతర వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, రహదారిపై వాహనం నడిపే సమయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని, వాహనం నడిపే సమయంలో ఏకాగ్రతతో నడపాలని, మానవ తప్పిదాల కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.
డి.సి.పి. మాట్లాడుతూ… జిల్లాలో నమోదైన మాదకద్రవ్యాల సంబంధిత కేసులలో 2024 సంవత్సరంలో మాదక ద్రవ్యాలకు సంబంధించి 63 కేసులు నమోదు కాగా 167 మంది అరెస్టు అయ్యారని, 2023 సంవత్సరాలలో 53 కేసులలో 82 మంది అరెస్టు అయ్యారని తెలిపారు. మాదకద్రవ్యాల తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసి నిరోధించడం జరుగుతుందని, 35 మందిని డ్రగ్ డి-అడిక్షన్ కేంద్రాలకు పంపించడం జరిగిందని తెలిపారు. ఎక్కడైనా మత్తు పదార్ధాల నిల్వ ఉన్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100లో సమాచారం అందించి తగ్గుముఖం పట్టేలా సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రధానంగా డ్రగ్స్ ఉత్పత్తి, రవాణాను అరికట్టడంలో టాస్క్ఫోర్స్ బృందాల ద్వారా చెక్పోస్ట్లు వద్ద విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జిల్లాలోని మందుల దుకాణాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సరైన అనుమతులు లేని దుకాణాలపై చర్యలు తీసుకోవడంతో పాటు వైద్యుల సూచన లేకుండా మందులు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో 2023 సంవత్సరాలలో ప్రమాదాల సంఖ్య 358గా నమోదై 120 మంది మృతి చెందారని, 63 మంది తీవ్రంగా, 285 మంది స్వల్పంగా గాయపడ్డారని, 2024 సంవత్సరంలో ఈ ప్రమాదాల సంఖ్య 453కు చేరుకోగా 147 మంది మృతి చెందారని, 40 మంది తీవ్రంగా, 433 మంది స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. జాతీయ రహదారి-63లో గూడెం- రాయపట్నం వంతె నుండి అర్జునగుట్ట వరకు 91 కిలోమీటర్ల పరిధిలో 2024 సంవత్సరాలలో 49 ప్రమాదాలు జరుగగా 16 మంది మృతి చెందారని, జాతీయ రహదారి-363లో శ్రీరాంపూర్ జి.ఎం. కార్యాలయం రోడ్ నుండి రేపల్లెవాడ గ్రామం వరకు గల 42 కిలోమీటర్ల పరిధిలో 33 ప్రమాదాలు జరుగగా 24 మంది మృతి చెందారని, రాష్ట్రీయ రహదారి-24లో ఇందన్పల్లి నుండి కరీంనగర్ చౌరస్తా వరకు 47 కిలోమీటర్లు, రాష్ట్రీయ రహదారి-1లో ఇందారం అటవీ చెకోపోస్ట్ నుండి జైపూర్ ఎక్స్ రోడ్ వరకు 7.3 కిలోమీటర్ల పరిధిలో 13 ప్రమాదాలు జరుగగా 8 మంది మృతి చెందారని, జిల్లాలోని ఇతర రహదారులపై 5 ప్రమాదాలలో 5 మంది మృతి చెందారని తెలిపారు.
2024 సంవత్సరాలలో డ్రంక్ & డ్రైవ్ తనిఖీలలో 10 వేల మందికి పైగా చలాన్ల ద్వారా జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలకు అనుసంధానమై ఉన్న రహదారులపైకి పశువులు వచ్చినట్లయితే వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాలకు తరలించాలని తెలిపారు. గుర్తించబడిన బ్లాక్ స్పాట్ ప్రాంతాలలో రేడియం సూచికలు, ఆయా ప్రాంతాలను గుర్తించే విధంగా ప్రత్యేకమైన లైట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల