Paddy Cleaner
Paddy Cleaner

Paddy Cleaners : మొరాయిస్తున్న ప్యాడీ క్లీనర్లు

321 కొనుగోలు కేంద్రాలకు 143 మెషిన్లు
ఇబ్బందులు పడుతున్న రైతన్నలు

Paddy Cleaners : జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని తూర్పార పట్టి తాలు, తప్ప లేకుండా చేసుకునేందుకు జిల్లా మార్కెటింగ్ అధికారులు కొనుగోలు చేసి తీసుకొచ్చిన యంత్రాలు మొరాయిస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అవి ఎప్పుడు పని చేస్తయో, ఎప్పుడు మూలన పడుతున్నాయో తెలియడం లేదు. ఆరిన ధాన్యాన్ని కాంటా పెట్టే ముందు ఈ యంత్రాలలో ధాన్యం పోసి క్లీన్ చేద్దామంటే రైతులకు కష్టాలు తప్పడం లేదు.

Paddy Cleaner
Paddy Cleaner

321 కొనుగోలు కేంద్రాలకు 143 మెషిన్లు
జిల్లాలో 321 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నామని అధికారులు అధికారికంగా ప్రకటించారు. వీటికి సరిపడా ప్యాడీ క్లీనర్లను తెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పాత క్లీనర్లు 94 ఉండగా ఇటీవల మరో 49 ప్యాడీ క్లీనర్లు తెప్పించినట్లు సమాచారం. దీనితో జిల్లా వ్యాప్తంగా మొత్తం 143 యంత్రాలు మాత్రమే ఉన్నాయి. రైతులందరు వీటి ద్వారా ధాన్యాన్ని ఎలా తూర్పార పట్టిస్తారో అధికారులకే తెలియాలి… ఒక వైపు తూర్పార పట్టిన ధాన్యానికే కారణాలు చెబుతూ బస్తాకు కిలో నుంచి రెండు కిలోలు మిల్లర్లు కోతలు పెడుతుంటే ప్యాడీ క్లీనర్ లేని కేంద్రం నుంచి వెళ్లిన లారీకి బస్తాకు ఇంకెన్ని కిలోలు కోత పెడుతారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Paddy Cleaner
Paddy Cleaner: రైతు కుప్ప వద్ద విద్యుత్ సరఫరా లేకపోవడంతో పక్కన పడేసిన యంత్రం

మొరాయిస్తున్న ప్యాడీ క్లీనర్లు
రైతుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ప్యాడీ క్లీనర్లు పట్టుమని పది రోజులు కూడా కాకుండానే పని పెడుతున్నాయి. ఒక మిషన్ కుప్ప నుంచి ధాన్యాన్ని లాగే మోటరు చెడిపోతే, మరో యంత్రం ధాన్యం గింజలను తీసుకునే పైపు చెడిపోవడం.., మరి కొన్ని యంత్రాలు ఏకంగా స్టార్ట్ చేస్తే పొగలు వస్తున్నాయని, ఇలాంటి యంత్రాలతో ఎలా ధాన్యం శుద్ది చేసేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెడిపోయిన యంత్రాలకు మరమ్మతులు తామే చేసుకోవాల్సి వస్తుందని, ఇవి తమపై అదనపు భారమే అవుతుందని ‘శెనార్తి మీడియా’తో వాపోయారు.

కేంద్రానికి ఒక యంత్రం సరిపోతుందా..?
కొనుగోలు కేంద్రానికి పెద్ద ఎత్తున ధాన్యం వస్తుంటుంది. ఒక కేంద్రానికి ఒక యంత్రం ఇస్తే రైతులందరి ధాన్యం తూర్ఫార పట్టడం ఎలా సాధ్యపడుతుంది. ఎండలకు ధాన్యం ఆరబోసిన రెండు రోజుల్లోనే తేమ శాతం తగ్గి ప్రభుత్వ ప్రమాణాలకంటే తక్కువైతుంది. ఒక్కో రైతు వడ్లు 10 తేమ శాతానికి వస్తున్నాయి. ఈ రైతులందరి ధాన్యం ఒక్క యంత్రంతో తూర్పార పట్టడం సాధ్యమయ్యే పనేనా..? రైతులను ఇబ్బందులు పెట్టడానికి తప్ప రైతులకు చేసిన మేలు ఇట్లనేనా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్వెస్టింగ్ చేసే సమయంలోనే ఫ్యాన్ 18 ఆర్పీఎం పెట్టించి కోయించినా మళ్లి లేనిపోని కండీషన్ లు పెట్టి సతాయించడం తప్ప మరేమి లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలు ఇస్తే కేంద్రానికో 10 పంపియ్యాలే కానీ చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు ఒక మిషన్ పంపి రైతులను కొట్టుకునేటట్లు చేస్తుండ్రని కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు వాపోతున్నారు.

Paddy Cleaner
Paddy Cleane : పాడైపోయిన మిషన్ నురిపేర్ చేస్తున్న స్థానికులు

రైతులకు తప్పని తిప్పలు
కమీషన్లకు కక్కుర్తి పడి నాసీ రకం యంత్రాలను తెప్పించిన అధికారులు వాటిని ఎలా ఉపయోగించాలి, వాటి సామర్థ్యం ఎంత అని కనీసం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కూడా కల్పించకపోవడంతో వాటిని ఉపయోగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. యంత్రాలను తీసుకుపోయి రైతులకు అప్పగిస్తుండటంతో ఎలా దీనిని ఆపరేట్ చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు. సంబందిత కంపనీ టెక్నీషియన్ వచ్చి అవగాహన కల్పించాల్సి ఉండగా ఎవరూ రాకపోవడంతో తెలిసీ తెలియకుండా ఆపరేట్ చేస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో కొంత మంది రైతులు తూర్పార పట్టిన ధాన్యంలో తాలు, తప్ప వస్తుందని, మా కష్టం అంతా వృథానే అయ్యిందని, మిల్లర్ కొంత చెత్త ఉన్నా కోతలు విధిస్తుండని బాధను వెల్లగక్కారు. ఇప్పటికైనా కంపెనీ టెక్నీషియన్ ను పిలిపించి యంత్రం ఎలా వాడాలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-శెనార్తి మీడియా, మంచిర్యాల 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *