- చెన్నూర్ ఎస్‌బీఐ గోల్డ్ లోన్ కుంభకోణం వాస్తవాలు
- కటకటాల్లోకి నిందితులు..
- 15.23 కిలోల బంగారం రికవరీ
- పని చేస్తున్న బ్యాంకుకు కన్నం వేసిన మేనేజర్, క్యాషియర్
- సహకరించిన ఇతర ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల సిబ్బంది
SBI Fraud: ఆన్ లైన్ బెట్టింగుల్లో నష్టాలు, చేసిన అప్పులు ఓ విద్యావంతుడు, బ్యాంకు ఉద్యోగిని పక్కదారి పట్టించాయి. చేసిన అప్పులు తీర్చడంతో పాటు బెట్టింగుల్లో కలిసొస్తే కోట్లు కూడబెడదామని అత్యాశకు పోయాడు. అనుకున్నదే తడవుగా తన ప్లాన్ అమలు చేయాలని నిర్ణయానికి వచ్చాడు. క్యాషియర్ ఇప్పటి దాకా నమ్మకంగా పని చేసిన ఆ బ్యాంకు ఉద్యోగిలో ఎప్పుడైతే ఈ దుర్భుద్ది పుట్టిందో… తనకు కావాల్సిన మార్గాలు వెతుక్కున్నాడు. బ్యాంకును మోసగించాలంటే ఒక్కడి వల్ల అయ్యే పనికాదు. దీంతో ముందుగా మేనేజర్ కు తన ప్లాన్ చెప్పి, డబ్బులు వస్తాయని లక్కీ భాస్కర్ సినిమా తరహాలో ఆశ చూపాడు. ఇందుకు వారిద్దరూ కలిసి బ్యాంకులో మరికొందరి సహకారం తీసుకున్నారు. అంతటి ఆగలేదు.. కాజేసిన సొత్తును లోన్ కింద మార్చి డబ్బులు తన ఖాతాలోకి పంపించుకునేందుకు ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో పని చేస్తున్న కొందరు సిబ్బందిని పావులుగా వాడుకున్నాడు. తన పాపంలో మొత్తం 44 మందిని ఇరికించేశాడు.
ఎస్‌బీఐ స్కామ్
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 44 మంది నిందితులను అరెస్టు చేసి, 15.23 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.61 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఫిర్యాదు వివరాలు
ఆగస్టు 23న ఉదయం రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. ఆయన తెలిపిన ప్రకారం .. 402 గోల్డ్ లోన్ ఖాతాల నుంచి 25.17 కిలోల బంగారం (రూ.12.61 కోట్లు విలువ), రూ.1.10 కోట్లు నగదు దుర్వినియోగమైనట్లు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు -బృందాల ఏర్పాటు
ఫిర్యాదు అందుకున్న వెంటనే రామగుండం కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తు బాధ్యత ఏసీపీ జైపూర్ ఏ.వెంకటేశ్వర్‌కు అప్పగించారు.
ఫ్రాడ్ జరిగింది ఇలా ?
క్యాషియర్ నరిగె రవీందర్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు నష్టపోయాడు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కుమ్మక్కై బంగారం, నగదు దుర్వినియోగానికి పాల్పడ్డాడు.గోల్డ్ లోన్ చెస్ట్ నుండి బంగారం తీసి ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలలో తాకట్టు పెట్టారు. 44 మంది పేర్లపై 142 నకిలీ గోల్డ్ లోన్లు తీసుకున్నారు. తన భార్య, బంధువుల పేర్లపై 42 నకిలీ గోల్డ్ లోన్లు మంజూరు చేసి రూ.1.58 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఏటీఎంల రీఫిల్ సమయంలో కూడా డబ్బు అపహరించాడు.
రికవరీ వివరాలు
పోలీస్ అధికారులు ఇప్పటివరకు ఎస్‌బీఎఫ్‌సీ, ఇండెల్ మనీ, గోదావరి అర్బన్, ముత్తూట్ మినీ, ఐఐఎఫ్ఎల్ నుంచి 15.23 కిలోల బంగారం రికవరీ చేశారు. ఇంకా ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, మనప్పురం, ముత్తూట్ ఫిన్‌కార్ప్ సంస్థల నుంచి బంగారం రికవరీ చేయాల్సి ఉంది. గోల్డ్ లోన్ కంపెనీ మేనేజర్ల పాత్రపై విచారణ కొనసాగుతోంది.
44 మంది అరెస్టు

మొత్తం 44 మంది అరెస్టు కాగా, వారిలో ముగ్గురు బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడు క్యాషియర్ నరిగె రవీందర్. ఈ కేసులో పలువరు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఉద్యోగులు, మధ్యవర్తులు కూడా పట్టుబడ్డారు.
అభినందనలు

ఈ కేసును తక్కువ కాలంలోనే చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులను రామగుండం కమిషనర్ అభినందించారు.
మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, జైపూర్ ఏసీపీ ఏ. వెంకటేశ్వర్, చెన్నూర్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్ రావు, చెన్నూర్ రూరల్ సీఐ ఆర్. బన్సీలాల్, శ్రీరాంపూర్ సీఐ డి. వేను చందర్, మంచిర్యాల్ రూరల్ సీఐ ఏ. ఆశోక్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నరేష్ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బాబురావు సహా పలు పోలీసు అధికారులు ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించారు.
అలాగే ఎస్ఐలు పి. సుబ్బారావు, శ్రీధర్, రాజేందర్, శ్వేత, సంతోష్, లక్ష్మీ ప్రసన్న, కోటేశ్వర్, ఉపేందర్ రావు, చంద్రశేఖర్, రవి, హెడ్ కానిస్టేబుళ్లు శంకర్, రవి, పీసీలు రమేష్, ప్రతాప్, తిరుపతి, లింగమూర్తి తదితరులు సమర్థంగా కృషి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ వారందరినీ అభినందిస్తూ, ఇలాగే ప్రజల రక్షణలో పోలీసు వ్యవస్థ చురుకుగా ఉండాలని సూచించారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
