- చేనేత కార్మికులకు ₹34 కోట్లు రుణమాఫీ, ₹900 కోట్ల ఆర్డర్లు
- తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో పరిశ్రమ ప్రారంభించిన మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల, పొన్నం
Apparel Park: రైతన్నలు, నేతన్నల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రధాన ధ్యేయమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (టెక్స్ పోర్ట్) యూనిట్‌ను రూ.62 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. 7.6 ఎకరాల్లో లక్షా 73 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్నలకు లక్ష రూపాయల చొప్పున రూ.34 కోట్లు రుణమాఫీగా మంజూరు చేసినట్టు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.914 కోట్ల బకాయిలను విడుదల చేశామని తెలిపారు. చేనేత భరోసా, చేనేత బీమా పథకాలతో పాటు ఒక్కరోజే రూ.290 కోట్ల నిధులు జమ చేసినట్టు వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని శాఖల అవసరాలకూ చేనేత కార్మికుల నుంచే వస్త్రాలు కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటికే వారికి రూ.900 కోట్ల ఆర్డర్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి వర్కర్ టు ఓనర్ పథకాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. చేనేత పరిశ్రమల అభివృద్ధికి సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు.

పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… గతంలో కాంగ్రెస్ హయాంలో నేతన్నలకు అంత్యోదయ కార్డులు మంజూరు చేశామని, వారి సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. సిరిసిల్ల నేతన్నల కృషికి దేశవ్యాప్తంగా గుర్తింపు కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… బెంగళూరుకు చెందిన టెక్స్ పోర్ట్ సంస్థ రూ.62 కోట్లతో సిరిసిల్లలో యూనిట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. మహిళా సంఘాలకు ఉచితంగా రెండు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకే అప్పగించినట్టు తెలిపారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… చేనేత కార్మికులకు లక్ష రూపాయల రుణమాఫీ పూర్తయ్యిందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాటన్, పాలిస్టర్ పరిశ్రమలతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రులను కోరారు. వేములవాడ పట్టణంలో రూ.50 కోట్లతో నూలు డిపో ఏర్పాటు చేశామని, 99 సంఘాలకు సబ్సిడీపై నూలు అందించామన్నారు.
ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, కంపెనీ సీఈఓ చంద్రశేఖర్, ఎస్పీ మహేష్ బీ గీతే, సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీవో రాధా బాయ్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, సిరిసిల్ల