- జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు

Sri Rama Navami: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం కనుల పండువలా సాగింది. భద్రాచలం తర్వాత రెండో అతిపెద్ద కళ్యాణ మహోత్సవం ఇల్లందకుంటలో జరుగుతుండడంతో జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలమాలలు సమర్పించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఇల్లందకుంట దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తదితరులు స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు.

దేవస్థానంలో ఈ నెల 4 నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 16 వరకు కొనసాగనున్నాయి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది. కళ్యాణం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం షామియానాలు, చలువ పందిళ్ళు భారీకేడ్లు, కార్పెట్లు ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, తాగునీటి వసతి కల్పించారు. స్వామి వారి కళ్యాణాన్ని జిల్లా వ్యాప్తంగా భక్తులు వీక్షించేందుకు లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేశారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వివిధ మార్గాల ద్వారా కళ్యాణానికి హాజరయ్యే భక్తుల కోసం ఆరు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ చేయించారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయి, లక్ష్మీ కిరణ్, ఆర్డిఓలు రమేష్, మహేష్ ఏసీపీ శ్రీనివాస్, దేవస్థానం ఈవో సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, కరీంనగర్