Gaddam Family
Gaddam Family

Gaddam Family: గడ్డం బ్యాచ్ పీచేముడ్

  • నిరసన తెలిపేందుకు వచ్చిన పెద్దపల్లి ఎంపీ వర్గీయులను అడ్డుకున్న పీఎస్సార్ అనుచరులు
  • ఎక్కడో అవమానం జరిగితే.. ఇక్కడికి వచ్చి షో చేయాలా?
  • అవన్నీ ఇక్కడ కుదరవంటున్న ప్రేమ్ సాగర్ రావు అనుచరులు
  • మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో ముదురుతున్న వర్గ పోరు

Gaddam Family: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో వర్గవిభేదాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం చెన్నూర్ క్యాంపు ఆఫీసులో షాడో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. మరో వైపు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రొటోకాల్ రగడ కొనసాగుతుంది. ఆ వేడి చల్లారక ముందే మంచిర్యాలలో గడ్డం వివేక్, వంశీకృష్ణ వర్గీయులు తమ నేతలను అవమానిస్తున్నారంటూ నిరసనకు దిగడంతో ఎమ్మెల్యే పీఎస్సార్ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాట మరోసారి బహిర్గతమయ్యాయి. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపేందుకు రాగా, పీఎస్సార్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత పార్టీపై నిరసనలు తెలియజేయడమేంటని ప్రశ్నించారు. అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాలకు ఎందుకు రోడ్డెక్కారంటూ ప్రశ్నించారు. అవమానం జరిగిన చోటే తేల్చుకోవాలని, ఇక్కడికి వచ్చి షో చేస్తామంటూ ఊరుకునేది లేదని ఘాటగా హెచ్చరించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు వచ్చి గడ్డం వర్గీయులకు నచ్చజెప్పి వెనక్కి పంపించారు. దీంతో పీఎస్సార్ వర్గం పై చేయి సాధించినట్లయ్యింది.

మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో పార్టీ సీనియర్ నాయకులు ఎటు వైపుల ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేమితో పార్టీ పెద్దలు సైతం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

కుటుంబ పెత్తనంపై గుర్రు..
పెద్దపల్లి ఎంపీ, చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ఒకే కటుంబానికి చెందిన వారు కావడంతో పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు కుటుంబ పెత్తనాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఏండ్లుగా పార్టీ జెండాను మోస్తున్న తమను కాదని, పార్టీలు మారుతున్న గడ్డం ఫ్యామిలీతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు, ప్రధాన లీడర్లు సఖ్యతగా కొనసాగలేకపోతున్నారు. అదే సమయంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తమకంటూ ప్రత్యేక గ్రూపును తయారు చేసుకుంటున్నారని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని హస్తం పార్టీలో ముందు నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనికి తోడు ప్రస్తుత పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ … కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఖరారు చేయక ముందే తానే అభ్యర్థినంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడంటూ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు సైతం వెళ్లాయి. దీంతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమైంది. వెంటనే తేరుకున్న గడ్డం ఫ్యామిలీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆశ్రయించి ఎలాగైనా తమకు మార్గం సుగమం చేయాలని వేడుకున్నారంటూ ఎన్నికల సమయంలో ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ మళ్లీ గాడిలో పడుతున్న నేపథ్యంలో పార్టీ పెద్దలు కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్యనేతలు, కార్యకర్తలను సముదాయించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. కొద్ది రోజుల పాటు గడ్డం ఫ్యామిలీ సఖ్యతగానే ఉన్నట్లు కనిపించినా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

మంత్రి పదవే కారణమా?
రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో మంత్రి పదవులను పరిమితంగానే కేటాయించింది. రెండో విడత మంత్రి వర్గ విస్తరణ రేపోమాపో ఉంటుందంటూ మీడియాలో, అటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది.
అయితే చెన్నూర్ నుంచి గెలిచిన వివేక్ వెంకటస్వామితో పాటు బెల్లంపల్లి నుంచి గెలిచిన గడ్డం వినోద్ సైతం మంత్రి పదవి కోసం ఏఐసీసీ స్థాయిలో తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఒక్క కుటుంబానికే పదవులా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో గడ్డం ఫ్యామిలీ సైతం తమకు మంత్రి పదవి రాదేమోనని లోలోపల రగులుతున్నట్లు సమాచారం. తమ తండ్రి కాంగ్రెస్ పార్టీకి, ఇటు జిల్లాకు ఎన్నో సేవలందించారని, తమను విస్మరించడం తగదని పార్టీ పెద్దల వద్ద విన్నించుకుంటున్నట్లు సమాచారం.

పీఎస్సార్ చెక్
పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేకున్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ జెండా మోసిన వారు ఎంతో మంది ఉన్నారని, అప్పటి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారని మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ ముందు నుంచి తన వాణి వినిపిస్తూనే ఉన్నారు. ఇటీవల ఏకంగా డిప్యూటీ సీఎం సభలో తనదైన శైలిలో వార్నింగ్ కూడా ఇచ్చారు. పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తే ఊరుకునేది లేదని, అడవి జిల్లా బిడ్డల గొంతు కోస్తామంటే సహించేది లేదంటూ ఏకంగా బహిరంగ సభలోనే తన స్టైల్ లో హెచ్చరించారు. దీంతో పీఎస్సార్ వార్నింగ్ ను కాంగ్రెస్ పార్టీ కూడా పరిగణనలోకి తీసుకుందని, ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని గ్రహించింది.

అక్కడి నుంచే మొదలు
మంచిర్యాల సభ నుంచే గడ్డం ఫ్యామిలీ గ్రూపు రాజకీయాలను మరింత ప్రోత్సహిస్తున్నదనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీని ఆహ్వానించకపోవడం, ఫ్లెక్సీల్లో ఫొటో లేకపోవడాన్ని తమకు అనుకూలంగా మలుచుకుందని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు పెద్దపల్లి ఎంపీ ప్రొటోకాల్ విషయంలో చేస్తున్న వ్యాఖ్యలను వివేక్ అనుకూల మీడియాలో ప్రచారం కావడంపై పార్టీ పెద్దలు కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇక లాభం లేదనుకున్న గడ్డం వివేక్, వంశీకృష్ణ తమ అనుచరులతో నిరసనలు చేయిస్తున్నారని టాక్ వినిపస్తున్నది.

psr vs gaddam
psr vs gaddam

గడ్డం బ్యాచ్ ను అడ్డుకున్న పీఎస్సార్ వర్గీయులు
పెద్దపల్లి ఎంపీ ప్రొటోకాల్ విషయంలో గడ్డం వంశీకృష్ణ అనుచరులు బుధవారం నిరసన తెలిపేందుకు వచ్చారు. విషయం తెలుసకున్న పీఎస్సార్ వర్గీయులు వారిని అడ్డుకున్నారు. దీంతో వంశీకృష్ణ అనుచరులు పీచేముడ్ అంటూ వెళ్లిపోయారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ యత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్స హిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. దళిత ఎంపీకి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే ధర్నాలు, రాస్తారోకోలు చేసుకోవాలే తప్ప.. మంచిర్యాలకు వచ్చి షో చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. జిల్లాలో ఒక కుటుంబంలా ఉన్న
కాంగ్రెస్ పార్టీని తండ్రీకొడుకులు కలిసి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ వైఖరిపై వంశీ వర్గీయుల ఆగ్రహం
మరో వైపు వంశీవర్గీయులు సైతం కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పు పడుతున్నారు. కాళేశ్వరంలో జరుగు తున్న సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లలో పెద్దపల్లి ఎంపీ తనవంతు కృషి చేశారని చెబుతున్నారు .పుష్కర ప్రదేశాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేయించారని పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధికి ప్రొటో కాల్ ఇవ్వకుండా అవమానిస్తున్నారంటూ మండిపడుతున్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి, ప్లకార్డులతో నిరసన తెలిజేయడానికి వస్తే పీఎస్సార్ వర్గీయులు వచ్చి అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా జిల్లా కేంద్రంలో ఇరువర్గాలు బాహాబాహికి దిగడం చర్చనీయాంశంగా మారింది.

శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *