- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయాలు
- అందుబాటులో మెడికల్ టాస్క్ ఫోర్స్ హెల్ప్ లైన్
- ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ
IMA DOCTORS : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ వైద్యులను గుర్తించి వారి నుంచి ప్రజలను కాపాడటమే లక్ష్యంగా మెడికల్ టాస్క్ ఫోర్సు పని చేస్తుందని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పుజారి రమణ అన్నారు. శుక్ర వారం ఐఎంఏ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీజీఎంసీ సభ్యుడు డాక్టర్ యెగ్గన శ్రీనివాస్ తో కలిసి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో మెడికల్ టాస్క్ ఫోర్స్ కీలక చర్యలు ప్రారంభించిందన్నారు. ప్రజల ఆరోగ్యం పేరుతో మోసపూరిత వైద్య సేవలు అందిస్తున్న నకిలీ వైద్యులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవడమే టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడటంలో నకిలీ వైద్యుల నిర్మూలన ముఖ్యమని, ఇందులో భాగంగానే జిల్లాలో మెడికల్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హెల్ప్‌లైన్ నెంబర్ సైతం ఏర్పాటు చేశామని, ప్రజలు 75575 55777కు నకిలీ వైద్యుల సమాచారం అందించాలని కోరారు. వరంగల్ జిల్లాలో విజయవంతమైందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ విజయవంతానికి అందరు సహకరించాలని, త్వరలోనే నకిలీ డిగ్రీలు, అనధికార క్లినిక్స్ మూసివేత వంటి చర్యలను ప్రారంభిస్తామన్నారు. ఐఎంఏ, టీహెచ్ఏఎన్ఏ, హెచ్ఆర్డీఏ, టీజీఎంసీ సంఘాల మద్ధతుతో ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల పట్టణంలోని ప్రముఖ వైద్యులు, నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ కుమార్ వర్మ, డాక్టర్ చంద్రదత్, డాక్టర్ స్వరూపారాణి, డాక్టర్ గోలి పూర్ణ చందర్, డాక్టర్ విశ్వేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
