Basara Temple
Basara Temple

Basara Temple : బాసర ఆలయంలో భద్రత ఏదీ ?

  • అమ్మవారి సన్నిధిలో కనిపించని మెటల్ డిటెక్టర్లు, సెక్యూరిటీ సిబ్బంది
  • పట్టించుకోని అధికారులు, ఆందోళనలో భక్తులు

Basara Temple : మారుతున్న కాలానుగుణంగా ప్రతి చోట భద్రతకు ప్రాధన్యమిస్తున్నారు. ఇళ్లు, దుకాణాలు, కూడళ్ల నుంచి మొదలుకొని ప్రతీ చోట సేఫ్టీకి పెద్ద పీట వేస్తున్నారు. ఇక ఆధ్యాత్మిక కేంద్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు వచ్చే భక్తులు ఆభరణాలతో పాటు తమ మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద మొత్తంలో నగదుతో వస్తుంటారు. ఇదే సమయంలో దొంగలు కూడా చేతి వాటం ప్రదర్శిస్తుంటారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీతో సీసీ టీవీల ఏర్పాటు ప్రతి చోట ఉంటున్నది. ఆలయాలకు సంఘ విద్రోహక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తున్నరు. ప్రస్తుతం చిన్న చిన్న ఆలయాల్లో సైతం మెటల్ డిటెక్టర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Basara Temple
గతంలో అమ్మవారి ఆలయంలో విధుల్లో సెక్యూరిటీ సిబ్బంది

కానీ నిత్యం వేలాదిమంది భక్తులు వచ్చే బాసర సరస్వతీ దేవాలయం లో మాత్రం అలాంటివి కనిపించడం లేదు. దీంతో ఈ ఆలయంలో భక్తుల భద్రత గాలిలో దీపంలా మారింది. గతంలో ఓ వ్యక్తి విధుల్లో ఉండగానే హోంగార్డు ముందు నుంచే వెళ్లి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. సరైన భద్రత లేకపోవడంతో సంఘ విద్రోహ శక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తే పరిస్థితి ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రం నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు.

ప్రత్యేక రోజులు, ఉత్సవాల సమయంలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయినా అధికారులు మాత్రం ఇక్కడ ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవడం లేదు. కనీసం లగేజ్ చెక్ చేసే మెటల్ డిటెక్టర్లు కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్ధం పడుతున్నది. బాసర ఆలయం లో తాత్కాలిక ఉద్యోగితోనే సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏటా కోట్లాది రూపాయలు భక్తుల కానుకల ఆలయానికి ఆదాయం సమకూరుతున్నా, వారి భద్రతను మాత్రం అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు.

Basara Temple
విధుల్లో కనిపించని సెక్యూరిటీ సిబ్బంది

చర్యలు తీసుకోవాలి
ఆలయానికి ఆదాయం రూ. కోట్లలో ఉన్నా అధికారులు మాత్రం అమ్మవారి సన్నిధిలో భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఆలయానికి భారీగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించి భద్రత చర్యలు చేపట్టాలి.
దత్తపురం రవి, బాసర

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఆలయంలో మెటల్ డిటెక్టర్లు లేని విషయం వాస్తవమే. ఈ విషయంలో గతంలో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం.అలాగే హోం గార్డ్ సిబ్బంది కూడా తక్కువగా ఉందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
సుదర్శన్ గౌడ్, ఏఈఓ, బాసర సరస్వతీ ఆలయం

– శెనార్తి మీడియా, బాసర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *