- రైతుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్రాల ఇంఛార్జీలు
- అన్నదాతల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వైనం
Paddy : మంచిర్యాల జిల్లాలో జోరుగా వరి ధాన్యం దందా కొనసాగుతోంది… నిన్న, మొన్నటి వరకు ప్రకృతి పగ పట్టగా నేడు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులతో రైతులు దగా పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చివరకు దళారుల రూపంలో రైతులు మోసాలకు గురవుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సన్నాలకు మంచి ధర ఫలికింది. ఆ సమయంలో మబ్బలు రైతుల పాలిట శాపంలా మారాయి. వ్యాపారులు ఒక్క సారి కొనడం ఆపేశారు. దీంతో రైతులు పండించిన పంటను ఇంటి వద్దనే భద్రంగా దాచుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటే మంచి లాభం వస్తుందని ఆశ పడ్డ రైతులకు ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలే దిక్కయ్యాయి.
రైతుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్రాల ఇంఛార్జీలు
ప్రైవేటు వ్యాపారులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు, ప్రజలకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అక్రమ సంపాధనకు అలవాటు పడ్డ ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని దగా చేయడం మొదలు పెట్టారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొని మిల్లులకు వారి బంధువుల పేరిట పంపి ప్రభుత్వ మద్దతు పొందుతున్నారు. ఇలా క్వింటాలుకు రూ. 300 వరకు రైతులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇందుకు దండేపల్లి మండలంలోని కొత్త మామిడిపెళ్లి గ్రామంలో జరిగిన సంఘటనే మంచి ఉదాహారణ.
అన్నదాతల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వైనం
మామిడిపల్లి గ్రామంలో ఓ పార్టీ నాయకుడు రైతుల నుండి ధాన్యాన్ని క్వింటాలుకు రూ. 2550 చెల్లించి కొనుగోలు చేసి వాటిని అదే గ్రామంలోని ఐకెపి కేంద్రం ద్వారా రైస్ మిల్ కు తరలించే ప్రయత్నంలో రైతులు జిల్లా ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయగా సంబంధిత శాఖ అధికారులు ఆ లారీని దండేపల్లి మండలం గూడెం గ్రామం వద్ద పట్టుకున్నారు. విచారించగా అసలు విషయం భయటపడింది. ప్రభుత్వం తరపున ధాన్యం తరలించే 40 కిలోల బ్యాగుల్లో ప్రైవేటుగా కొన్న ధాన్యాన్ని తరలిస్తున్నట్లు వెల్లడైంది. అధికారులు ప్రస్తుతం ఆ లారీని దండేపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచి అధికారులకు వివరాలు వెల్లడించారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల