CYBER CRIME
E CHALLAN SCAMS - CYBER CRIME

E CHALLAN SCAM : సైబర్ నేరగాళ్ల మరో కొత్త ఎత్తుగడ

  • ఏపీకే ఫైల్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్ల బురిడీ…
  • మీ బండిపై చలాన్‌ ఉందంటూ మోసం…
  • అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు…

E CHALLAN SCAM : సాంకేతికత అభివృద్ధి చెందుతున్నకొద్దీ, సైబర్‌ నేరాలు కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకొని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో కొత్త సైబర్ నేరం బయటపడింది. ట్రాఫిక్‌ చలాన్‌ పేరిట ప్రజలను మోసగించేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. ‘మీ బండిపై చలాన్‌ ఉంది.. కట్టేయండి’ అనే మెసేజ్‌లతో, ‘RTO Traffic Challan.apk2’ అనే ఫైల్‌ను వాట్సాప్‌ ద్వారా పంపుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు.

చలాన్‌ పేరిట వైరస్‌ ఫైల్‌…

ఈ ఫైల్‌ ఒక ఆండ్రాయిడ్‌ ప్యాకేజీ కిట్‌ (ఏపీకే). దీన్ని ఓపెన్‌ చేస్తే, మన ఫోన్‌ నేరుగా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ ఫైల్‌ ద్వారా ఫోన్‌లోని డేటా మొత్తం సైబర్‌ నేరగాళ్లు యాక్సెస్‌ చేసుకుంటారు. బ్యాంకింగ్‌ వివరాలు, పాస్‌వర్డులు, క్రెడిట్‌కార్డ్‌ సమాచారం, ఎస్‌ఎంఎస్‌ నోటిఫికేషన్లు – అన్నీ వారి నియంత్రణలోకి వెళ్తాయి.

సాయంత్రం సమయంలో మోసాలకు తెర…

ఈ తరహా ఫైల్స్‌ను ఎక్కువగా సాయంత్రం వేళల్లో పంపిస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. రోజంతా తమ పనులకు వెళ్లిన వారు సాయంత్రం వేళ్లలో అలసిన సమయంలో వస్తున్న మెసేజ్‌లపై అనుమానం లేకుండా ఫైల్‌ను ఓపెన్‌ చేయడంతో సైబర్ నేరగాళ్ల మోసానికి బలవుతున్నారు. “ఫోన్‌ ఒకసారి హ్యాక్‌ అయితే, ఆ వ్యక్తి ఆర్థిక భద్రత పూర్తిగా సంక్షోభంలో పడిపోతుంది” అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఎస్‌ఎంఎస్‌లు కూడా అదుపులోకి…

ఈ (APK) ఫైల్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత, సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ను రిమోట్‌ ద్వారా నియంత్రించగలుగుతారు. వ్యక్తిగతంగా వస్తున్న ఎస్‌ఎంఎస్‌ లను కూడా నిరోధించి, ఓటీపీలు, లావాదేవీల సమాచారం యజమానికి రాకుండా చేస్తారు. ఫలితంగా, ఖాతాల్లో డబ్బులు మాయమైనా బాధితుడికి అర్థం కాదు.

జాగ్రత్తలు తీసుకోవాలని సూచన :

  • గూగుల్‌ ప్లేస్టోర్‌ కాకుండా ఇతర లింకుల ద్వారా ఏపీకే (APK) ఫైల్స్‌ ఇన్‌స్టాల్‌ చేయరాదు.
  • గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌లను ఓపెన్‌ చేయరాదు.
  • బ్యాంకింగ్‌ యాప్‌లకు, క్రెడిట్‌ కార్డులకు ఓటీపీ అథెంటికేషన్‌ తప్పనిసరిగా ఉంచాలి.
  • అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి.
  • కార్డులను బ్లాక్‌ చేయడం ద్వారా మోసం ఇంకా జరగకుండా ఆపవచ్చు.
  • సైబర్‌ మోసాలపై వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలి లేదా 87126 72222 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలి.
TRAFFIC CI
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. సత్యనారాయణ

అప్రమత్తతే రక్షణ… బి. సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, మంచిర్యాల

ఏపీకే రూపంలో చలాన్లు కట్టాలని మెసేజ్ లురావు. వాహనదారులు, ప్రజలు వీటిని గుర్తించాలి. సైబర్ నేరస్తులు రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగా ఈ తరహా విధానాన్ని ఎంచుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కాస్త ఏమరపాటుగా ఉన్న వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకు వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి.

ACP
మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… ఆర్. ప్రకాష్, ఏసీపీ, మంచిర్యాల

సాధారణంగా ట్రాఫిక్‌ చలాన్‌ మెసేజ్‌లు అధికారికంగా రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ లేదా పోలీస్‌ శాఖ వెబ్‌సైట్ల నుంచి మాత్రమే వస్తాయి. వాటిని తమ అధికారిక వెబ్‌సైట్‌లోనే ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండకపోతే, ఈ తరహా మోసాల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *