MCH Scam:  ఎంసీహెచ్‌లో పెరుగు కట్ 

  • కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
  • బాలింతల మెనూలోనూ ‘డైట్’ నిర్వాహకుల కక్కుర్తి
  • ధికారిని ప్రశ్నిస్తే కాంట్రాక్టర్‌తో మాట్లాడాలన్న ఉచిత సలహా 
  • సూపరింటెండెంట్ కార్యాలయం నీడలోనే పోషకాహార దోపిడీ

శెనార్తి మీడియా, మంచిర్యాల:

MCH Scam: మంచిర్యాల జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌)లో గర్భిణీలు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిరోజూ మెనూలో ఉండాల్సిన పెరుగును కాంట్రాక్టర్లు కావాలనే ఎగ్గొడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఎంత? కాంట్రాక్టర్ల జేబుల్లోకి ఎంత వెళ్తోంది? అన్న ప్రశ్నలు బాధితుల నుంచే బహిరంగంగా వినిపిస్తున్నాయి.

 

సోమవారం మెనూలో పెరుగు మాయం

జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఉన్న భవనంలోనే ఇంతటి నిర్లక్ష్యం కొనసాగుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. సోమవారం గర్భిణీలకు అందించిన భోజనంలో అన్నం, బీరకాయ కూర, పప్పు, చారు, గుడ్డు, అరటిపండు, చిక్కి ఇచ్చారు. అయితే మెనూలో తప్పనిసరిగా ఉండాల్సిన పెరుగు మాత్రం ఇవ్వలేదు. వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే పెరుగు ఇస్తున్నారని బాలింతల బంధువులు ఆరోపిస్తున్నారు. వార్డులోని డాక్టర్లు, నర్సులకు కనీస సమాచారం ఇవ్వకుండానే కాంట్రాక్టర్లు భోజన పంపిణీ ముగించి వెళ్లిపోతున్నారని వారు మండిపడుతున్నారు.

MCH Scam
MCH Scam

ప్రభుత్వ మెనూ ప్రకారం మధ్యాహ్నం పోషకాలు

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మధ్యాహ్న భోజనంలో గర్భిణీలు, బాలింతల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆహార పదార్థాలు తప్పనిసరిగా అందించాలి:

అన్నం: నాణ్యమైన బియ్యంతో వండిన అన్నం

పప్పు, కూరగాయలు: ప్రోటీన్లు, విటమిన్ల కోసం రోజుకో రకం పప్పు, తాజా కూరగాయలు

పెరుగు/మజ్జిగ: కాల్షియం కోసం ప్రతిరోజూ భోజనంతో పాటు

గుడ్డు, పండు: రోజుకు ఒక ఉడికించిన గుడ్డు, అరటిపండు, చిక్కి వంటి పోషకాలు

 

ఆర్‌ఎంవో భీష్మ బాధ్యతారాహిత్యం

ఈ అంశంపై శెనార్తి మీడియా ప్రతినిధి వివరణ కోరగా ఆర్‌ఎంవో భీష్మ నిర్లక్ష్యంగా స్పందించారు. సూపరింటెండెంట్ సెలవులో ఉన్నారని చెప్పిన ఆయన, వివరాలు తెలుసుకుని చెప్తానని ఫోన్ కట్ చేశారు. అనంతరం మరోసారి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటికి తిరిగి ఫోన్ చేసి “మీకు కాంట్రాక్టర్ రవి ఫోన్ చేస్తాడు, అతనితోనే మాట్లాడుకోండి” అని చెప్పి బాధ్యత తప్పించుకున్నారని పేర్కొన్నారు. బాధ్యతగల అధికారి కాంట్రాక్టర్లను వెనకేసుకొస్తూ సమాధానం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోషకాహార దోపిడీపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *