LUXETTIPET SRO OFFICE (FILE)
LUXETTIPET SRO OFFICE (FILE)

Luxettipeta Regstror Office: లక్సెట్టిపేట రిజిస్ట్రార్ ఆఫీసులో ‘అనధికార’ మాయాజాలం..

  • ఎనిమిది నెలలుగా జీతం లేని కొలువులు..
  • తెర వెనుక కథ వేరే ఉందా..?

Luxettipeta Regstror Office:   ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ముగిస్తే ఆ ఉద్యోగికి కార్యాలయంతో సంబంధం ఉండదు. కానీ లక్సెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం నిబంధనలు ‘రివర్స్’ గేర్‌లో నడుస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగుల రెన్యువల్ ప్రక్రియ ఇంకా అటకెక్కినప్పటికీ, కొందరు వ్యక్తులు మాత్రం అక్కడే తిష్టవేసి అధికారిక పనుల్లో నిమగ్నమవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

 ఉచిత సేవలా..? లేక అదనపు ఆదాయమా..?

సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా నెల జీతం రాకపోతేనే ఆందోళన చెందుతాడు. కానీ ఇక్కడ మాత్రం సీన్ వేరు. గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వ పరంగా ఎలాంటి వేతనం రాకపోయినా, సదరు వ్యక్తులు క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నారు. ఇది ఆ కార్యాలయంపై ఉన్న మమకారమా లేక ఆ కుర్చీలో కూర్చుంటే వచ్చే ‘అదనపు’ లాభాల మీద ఆశనా? అన్న అనుమానాలు సామాన్యుల్లో కలుగుతున్నాయి. జీతం లేని ఉద్యోగులకు ఆ కార్యాలయ పెద్ద మేడమే స్వయంగా జీతాలు ఇస్తున్నారా? లేక వారే తమ మార్గాల్లో సంపాదించుకుంటున్నారా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

– ‘ముక్కుపిండి’ వసూళ్లు.. ఆ వ్యక్తులే రాజ్యమేలుతున్నారా?

కార్యాలయానికి వచ్చే ప్రజల నుండి ముక్కుపిండి వసూళ్లు చేయిస్తున్నది ఈ అనధికార వ్యక్తులేనని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “వారు చెప్పిందే వేదం.. వారు గీసిందే గీత” అన్నట్లుగా అక్కడ వ్యవహారం సాగుతోందని సమాచారం. అసలు అధికారి అండదండలు లేకుండా వీరు ఇంత ధైర్యంగా కార్యాలయంలో ఎలా తిరుగుతున్నారన్నది ఇప్పుడు మిస్టరీ. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు ‘పెద్దల’ హస్తం ఎవరిది..? అన్న చర్చ బహిరంగంగానే జరుగుతోంది.

– అసలు లబ్ధిదారులెవరు..?

ఔట్ సోర్సింగ్ పేరిట చెలామణి అవుతున్న ఈ వ్యక్తుల వల్ల లాభం ఎవరికి..? ప్రభుత్వానికా లేక తెరవెనుక ఉండి నడిపిస్తున్న అధికారులకా…? ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, ప్రైవేట్ వ్యక్తుల పెత్తనాన్ని ప్రోత్సహిస్తున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు మరియు అనధికార సిబ్బందిపై లోతైన విచారణ జరిపితే మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

శెనార్తి మీడియా, మంచిర్యాల:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *