- రాష్ట్రంలో హస్తంతో దోస్తీ.. మంచిర్యాల జిల్లాలో ‘గులాబీ’తో మంతనాలు
- సింగరేణి ప్రాంతంలో కుదరని కాంగ్రెస్–వామపక్ష సయోధ్య
- ఉనికి కోసం పొత్తులు తెంచుకుంటున్న కమ్యూనిస్టులు
- మున్సిపల్ ఎన్నికల వేళ వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు
- బీఆర్ఎస్ చెంతకు సీపీఐ..?
- సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్లేనా?
BRS-CPI Alliance: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారతున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్–సీపీఐ పొత్తు కుదరబోతుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మారుతున్న సమీకరణాలు స్థానిక నేతలతో పాటు కార్యకర్తల్లోనూ ఉత్కంఠను పెంచుతున్నాయి.
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన వామపక్షాలు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అదే పార్టీతో దూరమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల విషయంలో సయోధ్య కుదరకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మంచిర్యాల నియోజకవర్గంలో సీపీఐకి కేవలం రెండు సీట్లకే పరిమితం చేస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో అసంతృప్తికి లోనైన కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయ రాజకీయ దారులపై దృష్టి పెట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
మాజీ ఎమ్మెల్యేతో రహస్య మంతనాలా..?
కాంగ్రెస్ తీరుపై అసహనంతో ఉన్న సీపీఐ నేతలు బీఆర్ఎస్ కీలక నేతలతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, రాష్ట్ర స్థాయి నాయకుడు నడిపెల్లి విజిత్ రావులతో చర్చలు జరిగాయన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్‌లో కనీసం ఆరు సీట్ల కోసం ఈ మంతనాలు సాగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తీవ్ర రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు ఇప్పుడు ఎన్నికల అవసరాల కోసం దగ్గరవడం ఆసక్తికరంగా మారింది.
మంచిర్యాల కార్పొరేషన్‌లో 4 నుంచి 6 సీట్లు, క్యాతనపల్లి మున్సిపాలిటీలో 6 సీట్లు కేటాయించాలంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సీపీఐ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీలో సీట్ల పంపకాల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. గురువారం సాయంత్రం వరకు చర్చలు తుది దశకు చేరతాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
హ్యాండిచ్చిన హస్తం.. కనికరిస్తున్న కారు
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వెంట నడిచిన సీపీఐ నాయకులు, ఇప్పుడు తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికలను కీలకంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం కమ్యూనిస్టుల ప్రతిపాదనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నామినేషన్ల గడువు ముగియనుండటంతో, తమ భవిష్యత్తుపై తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో వామపక్షాలు ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుత పొత్తు కేవలం మున్సిపల్ ఎన్నికల వరకే పరిమితమవుతుందా..? పరిషత్ ఎన్నికల నాటికి ఇదే సమీకరణ కొనసాగుతుందా..? అన్న ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేమంటున్నారు గులాబీ పార్టీ నేతలు. కానీ మంచిర్యాల రాజకీయాల్లో మాత్రం మార్పు ఖాయం అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
