ALLEGATIONS ON S.R.O OFFICE LUXETTIPET : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (LAKSHETTIPET SUB REGISTRAR’S OFFICE) అవినీతికి నిలయంగా మారింది. నిబంధనలకు పాతర వేస్తూ, అడ్డగోలు వసూళ్లకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే ఏసీబీ (ACB)కి చిక్కినప్పటికీ, ఇక్కడి అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. కాంట్రాక్ట్ / అవుట్ సౌర్చింగ్ సిబ్బంది చెప్పిందే వేదంగా, డాక్యుమెంట్ రైటర్ల కనుసన్నల్లో ఈ కార్యాలయం నడుస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
- రిజిస్ట్రేషన్లకి ‘ఫిక్స్డ్’రేట్లు.!
ఈ కార్యాలయంలో అడుగు పెట్టాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఒక రేటు, మున్సిపాలిటీ పరిధిలో మరో రేటు చొప్పున అదనపు వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. రెండు గుంటల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే గ్రామ పంచాయతీ పరిధిలోని ప్లాట్లకు ₹. 10 వేల రూపాయలు, మున్సిపాలిటీ ప్లాట్లకు ₹15 వేల రూపాయల డిమాండ్, ఇంటి డాక్యుమెంట్లు కనీసం వెయ్యి రూపాయలు ఇచ్చుకోనిదే పని జరగని పరిస్థితి.
- నాలా నిబంధనలకు నీళ్లు..
ముఖ్యంగా ఇటీవల కాలంలో లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పది గుంటల భూమిని రెండు గుంటల ప్లాట్లుగా మార్చి అమ్మాలంటే ‘నాలా’(NALA) అనుమతులు తప్పనిసరి. కానీ, ఇక్కడ ఏ నిబంధనలు పాటించకుండానే ‘పార్ట్’ల కింద రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల కళ్లుగప్పి లేదా వారి సహకారంతోనే ఈ తంతు సాగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- కాంట్రాక్ట్ / అవుట్ సౌర్చింగ్ ఉద్యోగే చక్రం తిప్పుతున్నారా..?
జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కాంట్రాక్ట్ / అవుట్ సౌర్చింగ్ (CONTRACT / OUTSOURCING) సిబ్బందిని తొలగించినా, ఈ కార్యాలయంలో కొంతమంది కాంట్రాక్ట్ / అవుట్ సౌర్చింగ్ వర్కర్ ఇంకా కొనసాగడం వెనుక మతలబు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ మేడమ్ స్వయంగా ఆ ఉద్యోగి ద్వారానే వసూళ్లు చేయిస్తున్నారనే గుసగుసలు ఆఫీసు ఆవరణలో బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు మౌనం వహించడం చూస్తుంటే, ఈ అవినీతి భాగోతంలో అందరికీ వాటాలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది.
- అధికారులు స్పందించేనా…?
ఒకసారి ఏసీబీ వలలో చిక్కినప్పటికీ, అదే అధికారి మళ్ళీ అదే తీరుతో వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ఏసీబీ అధికారులు స్పందించి, లక్షెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు.
- నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్లు: సబ్ రిజిస్ట్రార్ నిర్మల
ప్రభుత్వ నిబంధనలకు లోబడే కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నామని, అక్రమాలకు తావులేదని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారి నిర్మల (SUB-REGISTRAR NIRMALA) స్పష్టం చేశారు. నాలా (NALA) అనుమతులు లేకుండా భూములను భాగాలుగా చేసి రిజిస్ట్రేషన్ చేయడం లేదని, చట్టపరమైన ప్రొవిజన్ ఉన్న వాటినే అనుమతిస్తున్నామని ఆమె తెలిపారు. కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది అంతా అధికారికంగా ఐ.జి.ఆర్.ఎస్ (IGRS) పోర్టల్లో నమోదైన వారేనని వెల్లడించారు. డాక్యుమెంట్ల కోసం అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ఖండిస్తూ, అటువంటి ఫిర్యాదులు ఉంటే బాధితులు నేరుగా తనను సంప్రదించాలని ఆమె సూచించారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :

