Pochamma Bonalu: మానకొండూర్ మండలంలోని రంగపేట గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పోచమ్మ బోనాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.
గ్రామస్తులు డప్పు చప్పుళ్ల నడుమ బోనాలు తీసుకుని ఊరేగింపుగా సాగి అమ్మవారికి మొక్కులు చెల్లించి నైవేద్యాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు, భక్తుల కేరింతలతో దేవాలయం భక్తి పరవశంగా మారింది.
చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామస్తులందరూ సంబురంగా పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. సల్లంగా సూడు పోచమ్మతల్లి అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు.
గ్రామంపై పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్త రాంరెడ్డి, ఉపసర్పంచ్ వేల్పుల కొమురయ్య, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు సమిష్టిగా పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మానకొండూర్
