- కన్నాలలో పెద్ద పులిసంచారం
- భయాందోళనలో అటవీ ప్రాంత వాసులు
- విద్యాసంస్థలకు సెలవులు
Tiger Roaming: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల అటవీ ప్రాంతంలో శనివారం ఓ పత్తి చేనులో పెద్ద పులి అడవి పందిపై దాడి చేసింది. మూడు రోజులుగా కన్నాల, బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు.
గ్రామాల్లో భయభ్రాంతులు…
శుక్రవారం ఉదయం కన్నాల, బుగ్గ అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్ద పులి అదే రోజు మధ్యాహ్నం కుంట రాముల బస్తీ, నీలగిరి ఫారెస్ట్ నుంచి పెద్దనపల్లి మామిడి తోటల్లోకి వెళ్లిపోయింది. స్థానికులు పెద్దపులి ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయిందని భావిస్తున్న తరుణంలో, శనివారం అదే కన్నాల అటవీ ప్రాంతంలోని పత్తి చేనులో అడవి పందిని తింటూ కనిపించడం ఆందోళన రేపుతోంది.

వచ్చింది ఒకటేనా.. ఇంకోటి ఉందా?
బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్ద పులి బీ-2 అయి ఉండొచ్చని, ఇది తిర్యాణి అడవుల నుంచి వచ్చి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కన్నాల అటవీ ప్రాంతంలో కనిపించిన పులి, పెద్దనపల్లి మామిడి తోటల్లో సంచరిస్తున్న పులి వేర్వేరు అయి ఉండొచ్చనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

విద్యాసంస్థలకు సెలవు
పెద్ద పులి ముప్పు పొంచి ఉందన్న భయంతో బుగ్గ, కరిశెలఘట్టం, అంకుశం, కన్నాల, లక్ష్మీపురం, కుంట రాములు బస్తీ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుంట రాములు బస్తీలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం శనివారం విద్యార్థులకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించింది.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
