- పదేళ్లుగా మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టుకున్న ప్రేమ్ సాగర్ రావు
- కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కొక్కిరాల
- మంత్రి విస్తరణలో చోటు దక్కే అవకాశం లేదంటూ ఓ వర్గం మీడియాలో కథనాలు
- వివేక్ వెంకటస్వామికి మినిస్టర్ పోస్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- కేబినెట్ విస్తరణ సమయంలో పీఎస్సార్ వర్గంలో కనిపించని జోష్
- సీఎం రేవంత్ కు సన్నిహితుడిగా ఉన్నా కనిపించని ఫలితం
- పీఎస్సార్ ఆధిపత్యానికి గడ్డం ఫ్యామిలీ చెక్ పెట్టబోతున్నదా?
PSR : కాంగ్రెస్ పార్టీ తూర్పు జిల్లా రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణం రాష్ర్టంలో అధికార పార్టీ మంత్రి వర్గ విస్తరణ చేపట్టడమేనని తెలుస్తున్నది. రేపుమాపు అంటూ ఊరిస్తు్న్న మంత్రి వర్గ విస్తరణ ఈ ఉగాదికి ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటినా ఢిల్లీకి వెళ్లడంతో మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
మంచిర్యాల జిల్లాలో క్లీన్ స్వీప్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల(Mancherial Dist) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఫలితాలు గులాబీ బాస్ కేసీఆర్కు ఊహించని షాక్ నిచ్చాయి.
ఇక పదేళ్ల తర్వాత రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంత్రి వర్గాన్ని పరిమితంగా కూర్పు చేసింది. సీనియర్లు ఉండడం, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ వెన్నంటి ఉన్న వాళ్లకు అవకాశం ఇవ్వాలనే యోచనలో హస్తం పార్టీ ఆలోచన చేసింది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు రావడం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గతం కన్నా కాస్త మెరుగైనా… అధికారాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు రావడంతో సరిహద్దు జిల్లాల ఎమ్మెల్యేలతో క్యాంపెయిన్ చేయించింది. అక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా చూడాలని టాస్క్ లు ఇచ్చింది. కానీ అక్కడా కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పలేదు
పథకాల అమలుపై దృష్టి…
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అయితే రోజురోజుకూ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. స్థానిక ఎన్నికలు సైతం నిర్వహించాల్సి ఉంది. ఈ సమయంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ మంత్రి విస్తరించబోతున్నదని తెలియడంతో ఆ పార్టీ నాయకులు సైతం షాకవుతున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి ఎవరో
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఏడింటిని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగా, ఒకటి బీఆర్ఎస్ గెలుపొందింది. గెలిచిన వాళ్లలో సీనియర్ల ప్రాతిపదికన చూసుకుంటే మంచిర్యాల పీఎస్సా్ర్ కు మంత్రి పదవి వరించబోతున్నదని ఊహాగానాలు వచ్చాయి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి గడ్డం వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా గడ్డం కుటుంబానికి పెద్దపల్లి ఎంపీ స్థానంతో పాటు చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే స్థానాల్లో టికెట్లు ఇస్తామని ముందుగానే హామీ తీసుకున్నట్లు సమాచారం. దీంతో రెండు ఎమ్మెల్యే స్థానాలతో పాటు పెద్దపల్లి ఎంపీ స్థానాల్లో బరిలో ఉన్న గడ్డం ఫ్యామిలీ విజయాలు అందుకుంది.
మంత్రి పదవి కోసం బెట్టు
గతంలో గడ్డం వివేక్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తన డిమాండ్లను కేసీఆర్ అంగీకరించకపోవడంతో కారు పార్టీని వీడి బీజేపీలో చేరారు. అక్కడి నుంచి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. పీఎస్సార్ మంచిర్యాల జిల్లాలో పార్టీని పదేళ్ల పాటు కాపాడుకున్నారనే సానుభూతి ఉంది. మంత్రి పదవి దక్కడం సముచితమనే భావన ఉన్నది. అయితే వివేక్, పీఎస్సార్ మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో సద్దుమణిగినట్లు అనిపించినా ఆ తర్వాత ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని అటు పీఎస్సార్, ఇటు వివేక్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకే మంత్రి పదవి ఇవ్వాలంటూ ఈ ఇద్దరు లీడర్లు బెట్టు చేస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తున్నది.
సోషల్ మీడియాలో ఆయనకే మంత్రి పదవంటూ ప్రచారం
ఇక సోషల్ మీడియాలో వివేక్(vivek) కే మంత్రి పదవి రాబోతున్నదంటూ జోరుగా ప్రచారం సాగుతున్నది. దీంతో పీఎస్సార్ వర్గీయులు మండిపడుతున్నారు. పార్టీలు మారిన కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు.. పార్టీ కోసం ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎన్నో కోల్పోయిన తమ నేత పీఎస్సార్ కు మొండి చేయి చూపడమేంటని పలువురు హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు.
దూకుడుతనమే కొంపముంచుతున్నదా?
ఎమ్మెల్యే పీఎస్సార్(MLA PSR) ముందు నుంచి దూకుడు స్వభావమున్న నేతగా గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఆ దూకుడు స్వభావం మరింత ఎక్కువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పేరిట కూల్చివేతలకు పాల్పడుతున్నారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. ఈ సాకుతో పీఎస్సార్ కు మంత్రి పదవి దక్కకుండా ప్రత్యర్థి వర్గం ఏఐసీసీ స్థాయిలో పావులు కదిపినట్లు తెలుస్తున్నది. ప్రత్యర్థి వర్గానికి మంత్రి పదవి దక్కితే జిల్లాలో పీఎస్సార్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలనే భావనలో ఉన్నట్లు సమాచారం. మంత్రి వర్గ విస్తరణ జరిగితే రాజకీయంగా జిల్లాలో ఏ మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
