MLC Elections
MLC Elections : వీసీలో పాల్గొన్న అధికారులు

MLC Elections : మండలి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

  • రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

MLC Elections : శాసనమండలి ఎన్నికలను అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎం.ఎల్. సి . ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడారు.

కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల స్థానానికి, నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయుల స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, ఈ ఎన్నికల కార్యచరణ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు జరిగే జిల్లాల వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని, 24 గంటలు , 48 గంటలు, 72 గంటలలో తీసుకోవలసిన చర్యల పై నివేదిక అందించాలని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్టింగులు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు.

శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 3న విడుదల చేయడం జరుగుతుందని, 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13 లోపు ఉపసంహరణ, 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న ఫలితాలు ఉంటాయని, 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 7వ తేదీ లోపు పరిష్కరించాలని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి. కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మీడియాలలో వచ్చే ప్రకటనలు / ప్రసారాలను పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కట్టుదిట్టంగా జరగాలని, పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అవసరమైన వసతులు కల్పించాలని, ఈ నెల 27న ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రచారానికి అవసరమైన అనుమతులను నిబంధనలకు లోబడి జారీ చేయాలని అన్నారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించాలని, బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని, జంబో బ్యాలెట్, సాధారణ బ్యాలెట్ బాక్సులను సరి చూసుకోవాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం కు ప్రిసైడింగ్ అధికారి, 3 పోలింగ్ అధికారులు ఉండే విధంగా సిబ్బందిని గుర్తించాలని, పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేని మారుమూల ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించవచ్చని, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ధ్రువపత్రాలు జారీ చేసి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. అకౌంటింగ్, ఎం.సి.సి. బృందాలు, ఫ్లైయింగ్, స్క్వాడ్, వీ.ఎస్.టి , వీ.వి.టి మొదలగు బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు.

పట్టభద్రులు, ఉపాధ్యాయులు కలిపి 1000 దాటని చోట కామన్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో కరీంనగర్ – అదిలాబాద్ – మెదక్ – నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు సంబంధించిన నామినేషన్ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో, నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ స్థానానికి సంబంధించిన నామినేషన్ నల్గొండ కలెక్టరేట్ లో స్వీకరించడం జరుగుతుందని, తదనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ శాసన మండలి సభ్యుల ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లాలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *