COLLECTOR
పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్

SEASONAL DISEASES : ముందుంది వ్యాధుల కాలం..

  •  వర్షాలతో పొంచి ఉన్న ప్రమాదం
  •  నివారణకు ప్రత్యేక కార్యాచరణ
  •  మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందం
  •  వైద్య శాఖ ముందస్తు ప్రణాళిక

SEASONAL DISEASES : వానా కాలం వచ్చిందంటే చాలు.. కాలనీల్లో మురుగు నీటి నిల్వలు, ఇంటింటికి కలుషిత నీరు సరఫరా, వార్డులలో పారిశుధ్య సమస్యలు, గ్రామాల్లో, పట్టణాల్లో అంటు వ్యాధులు, డయేరియా, ఇతర వ్యాధుల ముప్పు పరిపాటిగా మారుతోంది. వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటివి సోకితే, ఇంటి పరిసరాలలో అపరిశుభ్రతతో క్రిమి, కీటకాలు, దోమలు, వృద్ధి చెందే అవకాశం ఉంది. దీనితో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి విష జ్వరాలు సోకనున్నాయి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ శాఖలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అంతే కాకుండా విషజ్వరాల అడ్డుకట్టకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది.

జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్) తో పాటు అనుబంధంగా మాతా శిశు కేంద్రం పని చేస్తుంది. వీటితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 149 సబ్‌ సెంటర్లు, 24 గంటలు పనిచేసే 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 98 పల్లె దవాఖానలు, నాలుగు బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు జిల్లాలో సుమారు 300 ప్రైవేటు ఆసుపత్రులు పనిచేస్తున్నాయి.

  • ప్రత్యేక కార్యచరణ రూపొందించి…

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం మెండుగా ఉండగా అరికట్టేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరిష్ రాజ్ నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఇందు కోసం నలుగురు ప్రోగ్రాం అధికారులను, ఇద్దరు నోడల్‌ అధికారులతో పాటు 33 మంది సూపర్‌వైజర్లను నియమించి సీజనల్‌ వ్యాధులను పర్యవేక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మండల స్థాయిలో 17 టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. వ్యాధులు త్వరగా ప్రబలే 32 హైరిస్క్‌ ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో 100 రాపిడ్‌ బృందాలను ఏర్పాటు చేసి ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి 56 వ్యాధులపై సర్వే నిర్వహిస్తున్నారు. టీ హబ్‌ లో మలేరియా పరీక్ష కిట్‌లను అందుబాటులో ఉంచడమే కాకుండా 72 రకాల పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ముందస్తుగానే మందులు అందుబాటులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో ప్రతి మంగళ, శుక్రవారాలే కాకుండా హైరిస్క్‌ కేంద్రాల్లో ప్రతి రోజు డ్రై డే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు గ్రామాలలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

  • పెరుగుతున్న డెంగీ కేసులు…

ఏటేటా వర్షా కాలంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో 2020లో డెంగీ కేసులు 32 నమోదు కాగా 2021లో 116 కేసులు, 2022లో 118 కేసులు, 2023లో 72 కేసులు, 2024లో 224 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 25 డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అరికట్టేందుకే ముందస్తు జాగ్రత్తగా వైరల్‌ ఫీవర్‌, డెంగీ, మలేరియా కేసులను వైద్యులు గుర్తిస్తున్నారు.

  • ముందు జాగ్రత్తలతోనే మేలు…

దోమ కాటుతో డెంగీ, మలేరియా, చికెన్‌ గున్యా, బోధకాలు, మెదడు వాపు తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. డెంగీ వ్యాధి కారకమైన దోమ సాధారణంగా నిలువ ఉన్న నీటిలో వృద్ధి చెందుతుంది. పాత టైర్లలో, వాడి పడేసిన కొబ్బరి చిప్పలు, పాత కుండలు, పాత ఇనుప సామాగ్రిలో డెంగీ లార్వాలు వృద్ధి చెందుతాయి. వీటిని తొలగించాలని గ్రామ పంచా యతీ సిబ్బంది, పురపాలక సిబ్బంది వార్డుల్లో పర్యటించి ప్రజలకు తెలియజేస్తున్నారు. మురికి నీరు నిలువ నిలిచి ఉన్న ప్రాంతాల్లో ఫాంగింగ్‌ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా నిలిచిన నీటి గుంతల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయడం, లేదంటే దోమలను తినే గంబూసియా అప్పినిస్‌ చేపలను వాటిలో వేస్తుండాలి. మురుగు కాలువలు శుభ్రంగా ఉంచడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, ఫాగింగ్‌ లాంటివి చేయడంపై సంబందిత శాఖల అధికారులు దృష్టి సారించాలి. ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూడటడం, వారానికోసారి డ్రమ్ముల్లోని నీటిని పారబోయటం, నీటి ట్యాంకులు, డ్రమ్ములు, మంచి నీటి ట్యాంకులపై మూతలు పెట్టడం, కొబ్బరి చిప్పలు, పాత టైర్లలో నీరు నిల్వ లేకుండా చూడాలి.

DMHO HARISH RAJ
డాక్టర్ హరీష్ రాజ్

సీజనల్‌ వ్యాధులపై దృష్టి సారించాం… డాక్టర్‌ హరీష్ రాజ్, డీఎం అండ్ హెచ్‌ఓ, మంచిర్యాల

వర్షా కాలంలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్నాం. ఇందుకు అవసరమైన సమాచారాన్ని జిల్లా అధికారులకు ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అందించింది. జిల్లాలోని అన్ని మండలాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రజలు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

KUMAR DEEPAK
కలెక్టర్ కుమార్ దీపక్

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి… కుమార్ దీపక్, కలెక్టర్, మంచిర్యాల

జిల్లా ప్రజలు వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటి, పెరటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో సంబంధిత శాఖల సమన్వయంతో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు, అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. పారిశుధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తు న్నాం. మురుగు నీరు నిల్వ ఉండకుండా, రోడ్లపై చెత్తా చెదారం లేకుండా చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జిల్లాలో జ్వరం వార్డును ఏర్పాటు చేసి 150 బెడ్లు అందుబాటులో ఉంచాం. అంతే కాకుండా బెల్లంపల్లి, చెన్నూర్ లలోని 1‌00 బెడ్ల సీహెచ్సీలలో, లక్షెట్టిపేటలోని 30 బెడ్ల సీహెచ్సీలలో సైతం జ్వరంతో బాధపడేవారికి బెడ్లు కేటాయించాం.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *