విద్యార్థులతో కలసి అల్పాహారం చేసిన కలెక్టర్
Collector Breakfast with Students: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ షెడ్యూల్ కులాల బాలికల హాస్టల్‌ను శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఉదయం 8 గంటలకు హాస్టల్‌కు చేరుకున్న ఆయన, అక్కడ ఉన్న విద్యార్థులతో మమేకమయ్యారు.
విద్యార్థుల రోజువారీ జీవితాన్ని పరిశీలించేందుకు కలెక్టర్ స్వయంగా హాస్టల్ వంటగదిలోకి వెళ్లి తయారవుతున్న అల్పాహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థుల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వసతి, ఆహారం, చదువు సంబంధిత అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా పలువురు బాలికలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. వాటిని గమనించిన కుమార్ దీపక్, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హాస్టల్లో మెరుగైన వసతి, ఆహార సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చారు.
తర్వాత హాస్టల్ స్థలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించి, పనుల పురోగతిని సమీక్షించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్శన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని హాస్టల్ సిబ్బంది పేర్కొన్నారు.
కార్యక్రమం లో కలెక్టర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్, ఏఎస్ డబ్ల్యూ ఓ రవీందర్, హెచ్ డబ్ల్యూ ఓ చందన, సిబ్బంది పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల
