Maisamma: కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల నారదాసు వసంతరావు స్రవంతమ్మ దంపతుల ఇంట్లో ప్రతిష్టించిన బంగారు మైసమ్మ తల్లి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఉదయం నుండే భక్తులు తరలి వచ్చారు. తమ కోర్కెలు నెరవేరడంతో పలువురు భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలు, యాటపిల్లలు, నిలువెత్తు బంగారం (బెల్లం ) సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో హౌసింగ్ బోర్డు కాలనీ కిటకిటలాడింది. ఉత్సవ నిర్వాహకులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.. కళాకారులు అమ్మవారి పాటలు ఆలపించారు. దాదాపు 1000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నారదాసు వసంతరావు మాట్లాడారు. పదేళ్ల క్రితం తమ ఇంట్లో అమ్మవారి ప్రతిష్టించామని చెప్పారు. అప్పటి నుంచి ఏటా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఏటా రెండుసార్లు అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంక్రాతి పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం, ఆషాడమాసంలో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు. భక్తుల కోర్కెలు నెరవేరుతుండడంతో చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు.