Kishanreddy-bandi-sanjay
Kishanreddy-bandi-sanjay

BJP NATIONAL PRESIDENT : అధ్యక్ష.. రేసులో బండి సంజయ్?

  • కరీంనగర్ బిడ్డకు బీజేపీ జాతీయ పగ్గాలు
  • మోడీకి అత్యంత సన్నిహితుడిగా పేరు
  • కేంద్ర మంత్రిగా అందొచ్చిన అవకాశం
  • బండితో పోటీ పడుతున్న మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • జాతీయ మీడియాలో చక్కర్లు
  • మార్చి 15న అధ్యక్ష పదవిపై కీలక ప్రకటన

BJP NATIONAL PRESIDENT : బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారన్న వార్తలు నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీని దక్షిణాదిలో బలోపేతం చేయడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్న అగ్రనాయకత్వం.. పార్టీ అధ్యక్షుడిగా స్థానిక నాయకుడినే నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దక్షిణాదిలో ఇతర పార్టీల నుంచి బీజేపీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో… వాటిని ధీటుగా తిప్పికొట్టేందుకు ఈ ప్రాంతం నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలన్న ఆలోచనల్లో ఉందన్న వార్తలు ఢిల్లీ కేంద్రంగా వినపడుతున్నాయి.

దక్షిణాది నుంచి ముగ్గురు నేతలు…

ఈ రేసులో ముందంజలో దక్షిణాది నుంచి ముగ్గురు నేతలు ఉంటే… అందులో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం జేపీ నడ్డా ఉండగా… ఈ నెల 15లోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షుల ఎంపిక ఉన్న ఎన్నికల కారణంగా జనవరిలో జరగాల్సిన బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది.

నడ్డా స్థానంలో ఎవరు బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు..?
నడ్డా స్థానంలో ఎవరు బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పలువురు నేతలు రేసులో ముందంజలో ఉన్నారు. కర్ణాటకకు చెందిన ప్రహ్లాద్ జోషి, తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అలాగే మనోహర్ లాల్ ఖట్టర్, మనోజ్ సిన్హా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 15లోపు బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఆర్ ఎస్ ఎస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది…
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక చేసే నేతకు ఆర్‌ఎస్‌ఎస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంటుంది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం… పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు కనీసం 50 శాతం రాష్ట్ర యూనిట్లు తమ తమ అధ్యక్షులను ఎన్నుకోవాలి. అందువల్ల రాష్ట్ర స్థాయిలో పార్టీ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ వేగవంతం అవుతోంది. రాష్ట్ర అధ్యక్షులతో పాటు, జాతీయ అధ్యక్షుడి కోసం ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను కూడా ఎంపిక చేయాల్సి ఉంది.

దేశంలో 12 చోట్లనే ఎన్నికలు పూర్తి…
దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో… 12 చోట్ల మాత్రమే ఎన్నికలు పూర్తయ్యాయి. అంటే కనీసం ఆరు రాష్ట్రాలలో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రక్రియను మరో వారం రోజుల్లో పూర్తి చేసే అవకాశాలున్నాయి. జేపీ నడ్డా తొలుత 2019 జూన్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తాత్కాలికంగా నియమితులవ్వగా 2020, జనవరి 20న అధికారికంగా బీజేపీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు.

– శెనార్తి మీడియా, పొలిటికల్ డెస్క్ (మార్చి 3):

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *