- ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ దే
- ఓటమి మరింత బాధ్యతను పెంచింది
- కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధైర్య పడొద్దు
- పార్టీ పటిష్టతకు కృషి చేస్తా
- పార్టీలో లోటుపాట్లపై అధిష్టానం పెద్దలకు నివేదిస్తా..
- రానున్న రోజుల్లో .ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతా
- మీడియా సమావేశంలో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
Alphores VNR: కరీంనగర్ కాంగ్రెస్ లో నాయకత్వం లోపం ఉందని, పట్ట భద్రులఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమిచారని, తాను ఓడినా, నైతిక విజయం తనదేనని అల్ఫోర్స్ అధినేత వీ నరేందర్ రెడ్డి(Alphores VNR) అన్నారు. పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నరందర్ రెడ్డి (Narender Reddy)మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ వాదిగా పార్టీలో మరింత చురుగ్గా పని చేస్తానని చెప్పారు. పార్టీ పటిష్టతకు అధిష్టానం తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వరిస్తానని వెల్లడించారు.
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతున్నదన్నారు. పార్టీ ప్రక్షాళనకు తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసికట్టుగా పని చేసేలా కృషి చేస్తానని వివరించారు. చెల్లుబాటు కానీ ఓట్లు 11శాతం 28686 ఓట్లు తన ఓటమికి కారణమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. చెల్లుబాటు కానీ పదివేల ఓట్లు తనకు వచ్చేవేనని తెలిపారు.
ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా చేసిన విష ప్రచారాన్ని పట్టభద్రులు పట్టించుకోలేదన్నారు. ఓటర్లు మాత్రం తనకు మద్దతు పలికారని చెప్పారు. టెక్నికల్ గా తాను ఓటమిపాలైనా, నైతికంగా తానే విజయం సాధించానని వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కోసం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్(Congress) శ్రేణులు, అల్ఫోర్స్ కుటుంబ సభ్యులు, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, వివిధ కుల సంఘాల నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తనకు అండగా నిలిచిన మంథని ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minster Sridhar Babu)కు ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు.
ఎన్నికలకు ముందు 42 నియోజకవర్గాల్లో పట్టభద్రులకు ఇచ్చిన హామీల అమలుకు రేపటి నుంచే తన కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. చొప్పదండి వేములవాడ, సిరిసిల్లలో కాస్త వెనుకబడి ఉన్నామని తెలిపారు. చెల్లుబాటు కానీ ఓట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని కోరారు. 50 శాతం ప్లస్ వన్ ఓటు రాకపోయినా విజేతనుఎలా ప్రకటించారని నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో లోటుపాట్లపై పార్టీ పెద్దలకు నివేదిస్తానని, పార్టీలో స్తబ్ధత నెలకొందని పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
