Wedding Gift
Wedding Gift

Wedding Gift: ప్రాణం తీసిన పెళ్లి కానుక

  • ఇంగ్లీషు ఉపాధ్యాయుడి ఘోర ప్రతీకార కథ
  • ఏడేళ్ల తర్వాత నిందితుడికి జీవిత ఖైదు

Wedding Gift: ఏడేళ్ల క్రితం జరిగిన ఓ హత్య ఘటనలో విస్తుగొలిపే నిజాలు వెల్లడయ్యాయి. చివరికి నిందితుడికి న్యాయ స్థానం శిక్ష విధించింది. 2018లో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. వివాహమైన ఐదు రోజులకే ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సోమ్య శేఖర్ సాహూ (26) కి, రీమా తో వివాహం 2018 ఫిబ్రవరి 18న జరిగింది. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టడంతో ఆనందంలో ఉన్న కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలోకి దిగిపోయింది. ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో, బాలంగీర్ జిల్లాలోని పాటణగఢ్ పట్టణంలోని వారి ఇంటికి వచ్చిన ఓ కొరియర్ ఈ విషాదాన్ని నింపింది.

శుభాకాంక్షల బహుమతి అనుకొని తీసుకున్న ఆ పార్సెల్‌ ఓ ప్రాణాంతక బాంబు అని అది తెరిచే దాకా ఎవ్వరికీ తెలియలేదు. హరిత కాగితంలో చుట్టిన ఆ పార్సెల్‌ను సోమ్య తెరుస్తుండగా, ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. కిచెన్‌లో ఉన్న రీమా, అలాగే బహుమతిని చూసేందుకు వచ్చిన సోమ్య అమ్మమ్మ ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా సోమ్య, ఆయన అమ్మమ్మ మృతి చెందారు. రీమా పరిస్థితి విషమంగా ఉంది.

మిస్టరీగా మారిన కేసు
అయితే వారికి ఎవరితోనూ శత్రుత్వం లేదు. కానీ ఈ ఘటనకు కారకులు ఎవరనేది మాత్రం పోలీసులు అంత త్వరగా తేల్చలేకపోయారు. సోమ్య ఫోన్, ల్యాప్‌టాప్ సహా ఇంటి సంబంధాలు, మిత్రుల నెట్‌వర్క్ అన్నింటినీ పోలీసులు జల్లెడ పట్టారు. అయినా స్పష్టమైన ఆధారం లభించలేదు. పార్సెల్ పంపిన కొరియర్ కార్యాలయంలో సీసీ కెమెరా లేకపోవడం, స్కానింగ్ వ్యవస్థ లేకపోవడం, ఫేక్ అడ్రస్ ఉపయోగించారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారమే చేశారని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

విచారణనను మలుపు తిప్పిన అజ్ఞాత లేఖ

ఒకరోజు బాలంగీర్ ఎస్పీకి వచ్చిన ఓఅజ్ఞాత లేఖ విచారణను కొత్త మలుపు తిప్పింది. అందులో బా*ం*బు ప్రాజెక్టును ముగించినవారు ముగ్గురు అని, వారు న్యాయాన్ని నమ్మలేకే ప్రతీకారంగా పని చేశారని పేర్కొన్నారు. ఆ ఉత్తరాన్ని చూసిన సోమ్య తల్లి, అందులో వాడిన పదజాలం తమ కళాశాలలో పనిచేసే ఇంగ్లీషు టీచర్ పుంజీలాల్ మెహర్‌ను గుర్తు చేస్తుందని చెప్పారు.

తల్లిపై ద్వేషం – కొడుకుపై దాడి
పుంజీలాల్ గతంలో ప్రిన్సిపాల్‌గా ఉండగా, అనంతరం ఆ పదవి సోమ్య తల్లికి దక్కింది. అప్పటి నుంచి పుంజీలాల్‌లో ద్వేషం పుట్టినట్టు విచారణలో వెల్లడైంది. క్రమం తప్పకుండా అతడు అక్టోబర్ నుంచి పటాకుల నుంచి గన్‌పౌడర్ సేకరించి బాంబు తయారు చేశాడు. అప్పటికే సోమ్య వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న అతడు, గిఫ్ట్ రూపంలో బాంబును సిద్ధం చేసి, ఫేక్ అడ్రస్‌తో రాయ్‌పూర్‌లోని సీసీటీవీ లేని కొరియర్ కేంద్రం నుంచి పంపాడు.

పార్సెల్ పంపిన తర్వాత స్వయంగా అతడు సోమ్య వివాహానికి కూడా హాజరయ్యాడు. బాంబు పేలిన రోజు అంత్యక్రియల్లో పాల్గొనడం కూడా పుంజీలాల్ దుర్మార్గపు వ్యూహమే. కానీ, ఇక్కడే అతని తెలివి ఉపయోగించాడు. ఎస్పీకి వచ్చిన గోప్యతర ఉత్తరం కేసును ఓ దిశగా నడిపి, చివరకు నిజాన్ని వెలికి తీసింది.

ఏడేళ్ల తర్వాత న్యాయం
దీంతో కేసును కోర్టుకు అప్పగించగా, ఏడేళ్ల విచారణ అనంతరం 2025 మే 28న పుంజీలాల్‌కి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువడింది. ఇది క్రూరమైన హత్యకేసు అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కాగా, దోషికి ఉరిశిక్ష పడతుందని ఆశించిన సోమ్య కుటుంబానికి తీర్పుతో కొంత అసంతృప్తి మిగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *