విద్యా వ్యవస్థలో అతి జోక్యంపై ఆగ్రహం
Trasma Complaint: మంచిర్యాల జిల్లాలో కొంతమంది నకిలీ విద్యార్థి సంఘాల నాయకుల ప్రవర్తనతో ప్రైవేట్ పాఠశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ట్రస్మా జిల్లా శాఖ పేర్కొంది. విద్యార్థి సంఘాల పేరుతో పాఠశాలలపై బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ పెరిగిపోతున్నాయని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు దామెర్ల సిద్దయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ప్రత్యేకంగా బుక్స్, యూనిఫాంల అమ్మకాలు, అవి తమ వేదికల ద్వారా కొనాల్సిందేనన్న ఒత్తిడి, పాఠశాలల కార్యకలాపాల్లో అనధికారిక జోక్యం వంటి విషయాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని చెప్పారు. యాజమాన్యాలను భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తూ, ఇవి మంజూరుకాకపోతే సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తూ, పాఠశాల ఆస్తులకు హానికరం చేసే చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవానికి విద్యార్థి సంఘాల నేతలుగా ఉంటే వారు యూనివర్సిటీలలో చదువుతూ ఉండాలని, కానీ మంచిర్యాల జిల్లాలో చదువు పూర్తయ్యినవారు, ఉద్యోగాల్లో ఉన్నవారు, పెళ్లయినవారు కూడా తాము విద్యార్థి సంఘాలకు చెందినవారని చెప్పుకుంటూ ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తున్నారని ట్రస్మా ఆరోపించింది.
ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్నాయని, అన్ని నిబంధనలు పాటిస్తున్నప్పటికీ కొన్ని సంఘాలు స్వయంగా తనిఖీలు చేస్తున్నట్టు చెబుతూ పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో నకిలీ సంఘాల నిర్వాకాన్ని అరికట్టాలని, హాస్పిటల్స్‌కు వర్తించే ఆస్తి రక్షణ చట్టాన్ని పాఠశాలలకు కూడా వర్తింపజేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
విద్యార్థి సంఘాల పేరుతో ఎవ్వరూ పాఠశాలల పనుల్లో జోక్యం చేయరాదని, కార్యకాలంలో పాఠశాల ఆవరణలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలకు RTI చట్టం వర్తించదన్న విషయం పలు మార్లు అధికారులకు తెలియజేశామన్నా మళ్ళీ మళ్ళీ నోటీసులు ఇవ్వడంపై ట్రస్మా జిల్లా కోశాధికారి ఉదారి చంద్రమోహన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై రామగుండం పోలీస్ కమిషనర్‌ను కలిసేందుకు సుమారు 60 మంది ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు వెళ్లినట్లు ట్రస్మా తెలిపింది. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి ఉదారి చంద్రమోహన్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాపోలు విష్ణువర్ధన్ రావు, కస్తూరి పద్మ చరణ్, సురభి శరత్ కుమార్, అఖిలేందర్ సింగ్, గోపతి సత్తయ్య, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు కొమ్ము దుర్గాప్రసాద్, పట్టణ కోశాధికారి మోహన్ వర్మ, మందమరి పట్టణ అధ్యక్షులు పెద్దపల్లి ఉప్పలయ్య, దండేపల్లి మండల అధ్యక్షుడు బొలిశెట్టి లక్ష్మీనారాయణ, బెల్లంపల్లి మండల అధ్యక్షులు రాజలింగు, పోలు శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి సిహెచ్ విక్రమ్ రావు, వసీం, పెంచాల శ్రీధర్, కృష్ణమూర్తి, శేషు, తదితరులు సుమారు జిల్లావ్యాప్తంగా 60 మంది కరస్పాండెంట్ మిత్రులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :