ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Aadi Srinivas: ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ అగ్రహారం వద్ద శ్రీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మిడ్ మానేర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఖాళీ ఫ్లాట్లతో పాటు ఇళ్లు నిర్మించుకున్నవారికి ప్రత్యేక కోటాలో 847 మందికి అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం తొలి విడతలో 4 లక్షల 50 వేల ఇళ్లు మంజూరు చేసిందని, వాటిలో వేములవాడ నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లు ఇప్పటికే పంపిణీ చేసినట్లు తెలిపారు. మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు ప్రత్యేక కోటా కింద నేడు 847 ఇళ్లు మంజూరు చేశామని, ఇంకా 3 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు.
వేములవాడ అర్బన్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు తప్పనిసరిగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల మంజూరుతో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని తెలిపారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.76 కోట్ల నిధులు మంజూరై టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణను ధనిక రాష్ట్రంగా మారుస్తున్నామని, గత పాలకుల హయాంలో ఆర్థిక వ్యవస్థను అప్పుల కుప్పుగా మార్చిన తీరు ప్రజలకు గుర్తుంచేందుకు ప్రయత్నించారు.
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, గత ప్రభుత్వాలు ప్రారంభించిన పథకాలను కొనసాగించడమే కాకుండా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందని గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలులోకి వచ్చిందన్నారు.
వైయస్సార్ హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ, వ్యవసాయ విద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను కొనసాగిస్తూనే, పేదలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. అలాగే, నూతన రేషన్ కార్డుల జారీ కొనసాగుతోందన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న మరికొన్ని పథకాల వివరాలు తెలియజేస్తూ – రూ.500కే గ్యాస్ సిలిండర్, 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ చార్జీలకు 40 శాతం పెంపు, కాస్మొటిక్ చార్జీలకు 200 శాతం పెంపు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రత్యేకంగా వ్యాపార యూనిట్లు మంజూరు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. జిల్లా కలెక్టర్ పేదల పట్ల కారుణ్యంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, స్టేట్ రిజర్వు నుంచి మొట్టమొదటిసారిగా 5 వేల ఇందిరమ్మ ఇళ్లు మిడ్ మానేర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు మంజూరు చేయడం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ వల్ల సాధ్యపడిందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు నాలుగు దశల్లో మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు.
ఇళ్లు నిర్మించుకునే వారికి బేస్మెంట్ పూర్తి చేసిన తర్వాత రూ.1 లక్ష, గోడలు నిర్మించిన తర్వాత మరో లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.2 లక్షలు, పూర్తిగా ఇంటి నిర్మాణం అయిన తర్వాత మరో లక్షను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. 400 నుంచి 600 చదరపు గజాల లోపు మాత్రమే లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.
అమ్మ నాన్నలు చనిపోయిన పిల్లలకు ఆ ఇంటి హక్కు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నేటి పంపిణీలో 847 మందికి ఇళ్లు మంజూరు చేశామని, వీరు కొత్త సంవత్సరం లోపు నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాము, హౌసింగ్ శాఖ పీడీ శంకర్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, వేములవాడ
