Financial Assistance
Financial Assistance : విరాళం చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

Financial Assistance: సరస్వతీ పుత్రునికి ఆర్థిక చేయూత

  • ఎమ్మెల్యే కవ్వంపల్లి పిలుపుతో విరాళాల వెల్లువ
  • సాయమందించిన జిల్లా అదనపు కలెక్టర్

Financial Assistance: నీట్‌లో జాతీయ స్థాయిలో 453వ ర్యాంకు, ఎస్సీ విభాగంలో 17వ ర్యాంకు సాధించిన గంగిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి మార మహేశ్‌కు ఆర్థిక సాయం అందించేందుకు విరాళాల వెల్లువెత్తాయి.

ఎన్ఐటీలో చేరేందుకు ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతున్న సంగతి తెలుసుకున్న మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మహేశ్ విద్య కొనసాగేందుకు అవసరమైన సాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ పిలుపునకు స్పందనగా నియోజకవర్గంలోని మండలాల నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిపి ₹3,22,000 రూపాయల విరాళాలు సమీకరించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహేశ్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో చదివిన మహేశ్, జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం గొప్ప విషయం అని కొనియాడారు. మహేశ్ లాంటి ప్రతిభావంతుల చదువుకు దోహదపడేలా ప్రతి ఒక్కరూ తమవంతు చేయూతనివ్వాలన్నారు.

విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మహేశ్‌ను వెంటబెట్టుకొని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్, ఆర్డీవో మహేశ్వర్‌లకు పరిచయం చేశారు.

మహేశ్ కుటుంబ పరిస్థితులపై వారు తెలుసుకొని అభినందనలు తెలిపారు. అదనపు కలెక్టర్ వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించగా, ఆర్డీవో సైతం సాయానికి హామీ ఇచ్చారు.

తన విద్య కోసం అందిన సాయంతో మూడు సంవత్సరాల ఫీజును చెల్లించగలిగినట్టు మహేశ్ పేర్కొంటూ, ఎమ్మెల్యే కవ్వంపల్లి, అదనపు కలెక్టర్, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

– శెనార్తి మీడియా, కరీంనగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *