- గ్రామాల్లో మల్లన్న బోనాలు, పట్నాల సందడి
Shashti Bonalu:ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, వరంగల్ తో పాటు మంచిర్యాల , కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పల్లెల్లో షష్ఠి(మల్లన్న) బోనాల సందడి మొదలైంది. ఆయా గ్రామాల్లోని మల్లికార్జున స్వామి ఆలయాలతో పాటు ఇళ్లల్లో రెండు నెలల పాటు జరగనున్న మల్లన్న పట్నాలు, బోనాలకు ప్రత్యేకత ఉంది. ఏటా మార్గశిర మాసంలో ఈ ఉత్సవాలు మొదలై శివరాత్రి వరకు భక్తులు నిష్టతో పూజలు చేస్తుంటారు. షష్ఠి అమవాస్య మొదటి ఆదివారం నుంచి మల్లికార్జున స్వామికి బోనాలు, పట్నాలు వేసి ఒగ్గు పూజారులు స్వామి వారిని పూజలు చేస్తుంటారు. భక్తులు ముందుగా ఇం ట్లో బోనం చేసి ఆ తర్వాత ఆలయాల్లో మొక్కులు తీర్చుకుంటారు.
బోనాల వారం..
షష్ఠి అమవాస్య ప్రారంభం రోజు నుంచి బోనాలు నిర్వహిస్తారు. అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఇంట్లో మల్లికార్జున స్వామికి బోనాలు చేస్తారు. బోనాలు చేసే నాటి నుంచి తిరుగు వారం అయ్యే వరకు ఇంట్లోని వారు పాలు, పెరుగు, టీ తీసుకోరు. ఇంట్లో ఉన్న పాడి పశువుల పాలను మడి కట్టి పితుకుతుంటారు. పితికిన పాలను మట్టి పొయ్యిలు పెట్టి కుండలో పోసి వేడి చేస్తుంటారు. వాటి ద్వారా నెయ్యి తీసి స్వామివారికి సమర్పిస్తారు. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. పొలంలో పండిన వడ్లను బియ్యం పట్టిస్తారు. కొత్త బియ్యంతో బోనం వండుతారు. ఇత్తడి లేదా మట్టి పాత్రల్లో నైవేద్యం, పాయసం వండుతారు. బోనం కుండలకు గంధం, పసుపు పూసి బంతి పూలతో అలంకరిస్తారు. దేవుడికి పెట్టే నైవేద్యం కోసం గుమ్మండి, వంకాయలతో కూర వండుతారు. ఇందులో పోపు వేయరు. ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజ గదిలోని గద్దెలపై మల్లన్న ప్రతిమలను పెడుతారు. ఈ ప్రతిమల ఎదుట బోనాలను ఉంచి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా మొదటి వారం నుంచి నియమాలతో ఉండి ఇంట్లోని మల్లికార్జున స్వామికి బోనాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత భక్తులు స్థానిక మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ బోనాలు సమర్పిస్తారు. ఆది, బుధవారాల్లో స్వామి వారికి బోనాల సమర్పించడం ఆనవాయితీ.

భక్తి శ్రద్ధలతో పట్నాలు
ఇంట్లో బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆలయాల్లోనూ స్వామి వారికి పట్నాలు, ఒగ్గుకథలు, మల్లికార్జున స్వామి కల్యాణం నిర్వహిస్తారు. మూడు రోజులు, ఏడు రోజులు మల్లికార్జున స్వామి కథలు చెప్పి పట్నాలు వేస్తుంటారు. పట్నాలను అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగా వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రత్యేక నైపుణ్యం గల ఒగ్గు పూజారులు పసుపు, బియ్యం పిండి, తంగేడు ఆకులతో తయారు చేసిన పచ్చ పిండి, కుంకుమ కలిపి పంచ రంగులు తయారు చేస్తారు. పలకల్లో పంచ రంగులు నింపి వివిధ రూపాల్లో పట్నం వేస్తుంటారు. స్వామి వారి కల్యాణోత్సవం, నాగవెల్లి ఘట్టాలను ఆవిష్కరించేలా తయారు చేస్తుంటారు.
పుణ్య క్షేత్రాల్లో పూజలు..
మల్లికార్జునస్వామిని పరమ శివుడి ప్రతి రూపంగా భక్తులు కొలుస్తారు. పల్లెల్లోని స్థానిక ఆలయాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మల్లికార్జున స్వామికి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని కత్తెరసాల మల్లన్న ఆలయం, జైపూర్ మండలం వేలాల గట్టుమల్లన్న ఆలయం, బెల్లంపల్లిలోని బుగ్గరాజ రాజేశ్వర స్వామి ఆలయం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఈజ్గాం శివ మల్లన్న ఆలయం, పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున ఆలయంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పల్లెల్లో పెద్ద సంఖ్యలో మల్లికార్జున స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆయా మల్లికార్జున స్వామి ఆలయాల్లో పట్నాలు వేసి, కల్యాణోత్సవాలు జరిపిస్తుంటారు. బోనాలు, అన్న సంతర్పణలు చేస్తుంటారు. ప్రతి ఆది, బుధవారాల్లో బోనాలు, కథలు, పట్నాలతో దాదాపు రెండు నెలల పాటు ఆలయాలు సందడిగా కనిపిస్తుంటాయి.
మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఇలా..
మల్లికార్జున స్వామి పట్నాలను కథను బట్టి మూడు నుంచి ఏడు రోజుల పాటు నిర్వహిస్తుంటారు. స్వామి వారి ప్రతిమలను మూట గట్టి తలపై పెట్టుకుంటారు. పిల్లన గ్రోవి, ఢమరుకం వాయిద్యాల నడుమ గోదావరి పుణ్యస్నానానికి తీసుకెళ్లారు. గోదావరిలో ప్రతిమలను శుద్ధి చేసి అక్కడే ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి వచ్చి అలంకరించిన కుండల (కూరాల్లు)తో డోలు వాయిద్యాలు, ఆటపాటలతో పుట్టల వద్దకు చేరుకుంటారు. పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త గంపలో పుట్ట బంగారం(మట్టి) తెచ్చి స్వామి వారికి గద్దె ఏర్పాటు చేస్తారు. పుట్ట మట్టిని తడిపి నేలపై పట్నం వేస్తారు. పట్నంపై స్వామి వారి ప్రతిమలను ఉంచి మల్లికార్జునుడి కల్యాణ తంతును కథగా చెబుతారు. కథతో పాటు అక్కడే కల్యాణోత్సవం జరిపిస్తారు. కథ పూర్తయిన అనంతరం నాగవెల్లి పట్నం వేసి మొక్కులు చెల్లించుకుంటారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల

Nice story
సూపర్ అన్నా… జై మల్లన్న
జై మల్లన్న nice story
Nice story