- హస్తినకు చేరిన ఈటల–బండి వివాదం
- హైకమాండ్ స్పందనపై ఉత్కంఠ..
- నేడు నడ్డాతో స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు భేటీ
Bandi vs Etala: భారతీయ జనతా పార్టీ నేతలైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఢిల్లీ వరకూ చేరింది. పార్టీ వర్గాలలోనే కాకుండా రాజకీయంగా ఇతర పార్టీల మధ్య కూడా ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈటల చేసిన విమర్శలు తీవ్రతరం కావడంతో బీజేపీ జాతీయ నాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
హైకమాండ్‌కు నివేదికలు?
ఈటల రాజేందర్ ఇటీవల బండి సంజయ్‌పై బహిరంగంగా విమర్శలు చేయడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం వెంటనే స్పందించింది. శనివారం రోజునే ఈటల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను పార్టీ కేంద్ర అధిష్ఠానానికి పంపించగా, ఆదివారం మరో విపుల నివేదికను అందించినట్టు సమాచారం. ఈ నివేదికలో ఈటల బీజేపీలో చేరినప్పటి నుంచి ఇప్పటి దాకా ఆయన్ను పార్టీ ఎలా గౌరవించి, ప్రాధాన్యత ఇచ్చిందో వివరించారు.
ఈటల 2021లో బీజేపీలో చేరిన వెంటనే హుజూరాబాద్ ఉపఎన్నికలో టిక్కెట్ ఇచ్చారు. ఆయన గెలుపుకోసం రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది కార్యకర్తలు, ఆరెస్సెస్ వలంటీర్లు వచ్చి పని చేశారు. చెట్ల కింద ఉంటూ ఉంటూ, స్వంతంగా భోజనాలు సమకూర్చుకున్నారు. ఇంటింటికీ తిరిగారు. ఈటల గెలుపును వ్యక్తిగతంగా భుజాల మీదు వేసుకొని పనిచేశారు.
ఈటల ఆరోపణల్లో వాస్తవమెంత?
ఈటల పార్టీలో చేరిన కొద్దికాలానికే జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. అంతేకాదు, జాయినింగ్స్ కమిటీ బాధ్యతలతో పాటు పలువురు కీలక నేతలతో బంధాలను ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారు. అయినా ఒక్క ముఖ్య నేతను కూడా పార్టీలోకి చేర్చలేకపోయారన్న ఆరోపణలు నివేదికలో ఉన్నాయి.
ఇక హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలవడంలో పార్టీ కీలక పాత్ర పోషించిందని హైకమాండ్‌కు నివేదికలో వివరించారు.
60 శాతం పదవులు ఈటల వర్గానికే?
ఈటల అనుచరులకు పార్టీలో సరైన ప్రాధాన్యం లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా స్థాయిలో తన మద్దతుదారులకు భారీగా పదవులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా, మండల, బూత్ కమిటీల జాబితాలో 60 శాతానికి పైగా పదవులు ఈటల వర్గానికే లభించాయని పేర్కొన్నారు.
నడ్డా, మోదీ, అమిత్‌షాలతో భేటీలు
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానుండటంతో బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఇతర ఎంపీలు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈటల మాత్రం సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు కూడా సోమవారం ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవనున్నారు. ఈ సందర్భంగా ఈటల.. బండి సంజయ్ ఎపిసోడ్ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అలాగే ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలను కూడా రాంచందర్‌రావు మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే బీజేపీలో అంతర్గత కలహాలు మరింత ముదురుతున్నట్టు స్పష్టమవుతోంది. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతోంది.
శెనార్తి మీడియా, వెబ్ డెస్క్
