- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
Minister Seethakka : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో, ఐక్యతలో అగ్రభాగాన నిలిపి రాష్ట్రానికి ఆదర్శంగా చూపాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కార్యచరణ ప్రణాళిక-సమీక్ష సమావేశంలో మం మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, రాజర్షి షా, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అదనపు కలెక్టర్లు సబావత్ మోతిలాల్, దీపక్ తివారి, శ్యామలాదేవి, ఫైజన్ అహ్మద్, కిశోర్ కుమార్, శాసనమండలి సభ్యులు దండే విఠల్, నిర్మల్, బోథ్, ఖానాపూర్, ముథోల్, ఆదిలాబాద్ నియోజకవర్గాల శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్రెడ్డి, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, రామారావుపటేల్, పాయల శంకర్ లతో కలిసి ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల అమలులో లబ్దిదారుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఇల్లు లేని నిరుపేద లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రింద ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, రేషన్ కార్డుల జారీలో నిబంధనలు పాటిస్తూ అర్హులైన అభ్యర్థుల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇతర ప్రజా సంక్షేమ పథకాల అమలులో అందరూ నిబద్ధతతో పని చేయాలని తెలిపారు. ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అదే రోజున అర్హులైన వారికి పథకాల ఫలాలు అందే విధంగా అధికారులు పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసి గ్రామసభలో అర్హులను గుర్తించాలని, గ్రామ సభ నిర్వహించే ముందు ఆయా ప్రాంతాల ప్రజలకు సమాచారం అందించాలని తెలిపారు. గ్రామ సభ కొరకు ఒక మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని సమాచారం కొరకు ఒక ప్రత్యేక మొబైల్ నంబర్ను కేటాయించి ప్రజలకు తెలిసే విధంగా ప్రదర్శించాలని తెలిపారు.
రైతు భరోసాలో అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదని, రాళ్లు, గుట్టలు, కాలనీలు, ఇండ్ల వెంచర్లు, లే అవుట్లు, నాలా భూములు, వివిధ అభివృద్ధి పథకాల కొరకు ప్రభుత్వం సేకరించిన భూములు జాబితా నుండి తొలగించాలని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద నిరుపేద కూలీలు, వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉ పాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పని చేసిన కుటుంబాలను గుర్తించాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని అర్హత గల నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తించేలా చూడాలని తెలిపారు.
10 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రకటించడం జరిగిందని, అర్హులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కృషి చేయాలని తెలిపారు. సర్వే ప్రక్రియ నిర్వహణలో అధికారులు, సిబ్బందికి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే పైఅధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. రహదారులు, త్రాగునీటి వనరులు, విద్యుత్ సరఫరా లేని గ్రామాల వివరాలతో జాబితా తయారు చేసి అందించాలని, ఆ గ్రామాలలో సౌర విద్యుత్, అటవీ, సంబంధిత శాఖల అనుమతులు పొంది రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా నెలకొన్న సమస్యలపై పూర్తి వివరాలతో నివేదిక రూపొందించినట్లయితే వచ్చే సమావేశంలో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ పథకాల అమలు బాధ్యత అధికార యంత్రంగానికి అప్పగించడం జరిగిందని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే అర్హత గల లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో పని చేయాలని, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా కృషి చేయాలని తెలిపారు. అధికారులు ప్రజలతో మమేకమైన వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిబద్ధతతో పని చేసి ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రైతు భరోసా పథకంలో భాగంగా జిల్లాలోని రెవెన్యూ గ్రామాల డాటా సంబంధిత అధికారులకు అందించడం జరిగిందని, 55 మంది విస్తరణాధికారులతో ఈ నెల 16వ తేదీ నుండి సర్వే నిర్వహించడం జరుగుతుందని, 1 లక్షా 64 వేల 141 మంది రైతులకు సంబంధించి 3 లక్షల 50 వేల 213 ఎకరాల భూమికి కార్యచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రజాపాలనలో రేషన్కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించడం జరుగుతుందని, ఈ క్రమంలో జిల్లాలోని 16 మండలాలో 11 వేల 767 ఇండ్లు ఉండగా 7 వేల 927 ఇండ్లు సర్వే చేయడం జరిగిందని, 7 మున్సిపాలిటీలలో 18 వేల 788 ఇండ్లు ఉండగా 14 వేల 25 ఇండ్ల నుండి వివరాలు సేకరించడం జరిగిందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో 2 లక్షల 5 వేల 939 దరఖాస్తులు రాగా 1 లక్షా 97 వేల 954 దరఖాస్తులను పరిశీలించి 96 శాతంతో 1 లక్షా 95 వేల 890 దరఖాస్తులను సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు ప్రత్యేక బృందాల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి లబ్దిదారుల ముసాయిదా జాబితా తయారు చేయడం జరుగుతుందని, ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు గ్రామసభలు, ఈ నెల 21 నుండి 25వ తేదీ వరకు డాటా ఎంట్రీ కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 26వ తేదీన పథకాల అమలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల/నిర్మల్
