Game Changer Review : దర్శకుడు శంకర్ సౌత్ సినిమాను 30 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన సంచలన డైరెక్టర్. అటు కమర్షియల్‌గా ఇటు.. సోషల్ మెసేజ్ తో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దిగ్గజం. ఈ టాప్ డైరెక్టర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన చిత్రం గేమ్ చేంజర్.. మరి ఈ మూవీ హిట్టా.. ఫట్టా.. ఎలా ఉందో తెలుసుకుందాం.
ఇదీ కథ..
గేమ్ ఛేంజర్ కథ రామ్ నందన్ (రామ్ చరణ్) అనే యువకుడి చుట్టూ తిరుతుంది. బాధ్యతాయుతమైన ఓ యువ ఐఏఎస్ అధికారి కథ. స్టేట్ కు సీఎం కావాలనుకునే ఓ బొబ్బిలి మోపిదేవి (ఎస్ జే సూర్య) అనే అవినీతి రాజకీయ నేతను ఢీకొనే కథ. సమాజంలో మార్పు కోసం రామ్ నందన్ చేసే ప్రయత్నమే ఈ సినిమా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్)తో సినిమా మొదలవుతుంవది. అడ్డదారిలో ముఖ్యమంత్రి పదవి చేజిక్కించుకున్న సత్యమూర్తి అవినీతికి కేరాప్ అడ్రస్‌గా మారుతాడు. కానీ తనలో పశ్చాత్తాపం మొదలవుతుంది. తన పదవీకాలం చివరి ఏడాదిలో రాష్ట్రంలో ఎలాంటి అవినీతి ఉండకూడదనుకుంటాడు సత్యమూర్తి. అతని మంత్రివర్గంలోని సత్యమూర్తి కొడుకులు మోపిదేవి (ఎస్.జే సూర్య), రామచంద్రరెడ్డి (జయరాం) తండ్రిని విభేదిస్తారు. చివరికి తండ్రినే చంపేసి.. ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు మోపిదేవి. అదే సమయంలో సొంత ఊరు వైజాగ్ కలెక్టర్‌గా రామ్ నందన్ (రామ్ చరణ్) నియామకమవుతాడు. .
హీరో ఎంట్రీతోనే అవినీతి ప్రభుత్వంపై ఉక్కుపాదం మోపి.. మోపిదేవికి చెక్ పెడతాడు. అనూహ్య పరిస్థితుల్లో సత్యమూర్తి.. రామ్ నందన్‌ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడు. అసలు రామ్ నందన్(రామ్ చరణ్) ఎవరు? అతని గతమేంటి.. అభ్యుదయం పార్టీ, సత్యమూర్తితో ఉన్న సంబంధం ఏమిటి? రామ్ నందన్‌ని సీఎంగా ఎందుకు ప్రకటించాడు? అప్పన్న (రామ్ చరణ్)కి రామ్ నందన్‌కి ఉన్న రిలేషన్ ఏమిటన్నదే మిగతా స్టోరీ.
విశ్లేషణ..
అవినీతిపరుల ఆట కట్టిస్తూ గతంలో శంకర్ తీసిన జెంటిల్‌మెన్, ఒకేఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు సినిమాల్లో హీరో అతి సామాన్యుడే. ఆ సామాన్యుడి తిరుగుబాటే శంకర్ సినిమాలకు మూలం. కానీ ‘గేమ్ ఛేంజర్’ సినిమా శంకర్ గత చిత్రాల కథలకు భిన్నంగా సాగింది. ఈ కథలో హీరో ఓ పవర్ ఫుల్ ఐఏఎస్ అధికారి. బ్యూరోక్రసీ వర్సెస్ పొలిటికల్ బాసిజం నేపథ్యంలో నడిచే ఎమోషనల్ డ్రామా ఈ ‘గేమ్ ఛేంజర్’.
దర్శకుడు శంకర్ సోషల్ మెసేజ్ ఇస్తున్నారంటే.. ఆ కథలో బలమైన ఫ్లాష్ బ్యాక్ కచ్చితంగా ఉంటుంది. ‘గేమ్ ఛేంజర్’కు కూడా ఫ్లాష్ బ్యాకే కీలకం. అప్పన్నగా రామ్ చరణ్ పంచెకట్టు క్యారెక్టర్ ‘గేమ్ ఛేంజర్‌కి ఆత్మగా చెప్పవచ్చు. ఓ గొప్ప సందేశాన్నివ్వడంతో పాటు అంతకంటే గొప్పగా భావోద్వేగాలతో కనెక్టివిటీతో అద్భుతంగా సినిమాను తెరకెక్కించడంలో శంకర్ దిట్ట. కొన్నాళ్లుగా తన మార్క్‌ని మిస్సవుతున్న శంకర్.. ‘గేమ్ ఛేంజర్’ తో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు.
ప్రతి ఒక్కరు తమ జీవితంలో విమర్శలు ఎదుర్కోవాల్సిందే. వాటి నుంచి తప్పించుకోలేం. ఎవరు ఎవరినైనా ఎందు కోసమైనా విమర్శించవచ్చు. కానీ వాటి నుంచి ఏం నేర్చుకున్నారనేదే కీలకం. విమర్శల్ని సవాల్ గా తీసుకుని తనను తాను మెరుగుపరుచుకున్నవాడే ‘గేమ్ ఛేంజర్’ అవుతాడు. డైరెక్టర్ శంకర్ కూడా అలాంటి గేమ్ ఛేంజింగ్ మూమెంట్ కోసం.. తన సొంత కథల్ని పక్కన పెట్టి.. కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన స్టోరీతో ‘గేమ్ ఛేంజర్’ని తెరకెక్కించాడు.
ముఖ్యమంత్రి. మంత్రి మండలి.. ఎన్నికల కమిషన్.. ఐఏఎస్‌లు.. ఐపీఎస్‌లు.. ఇలా భారీ సెటప్‌తో ‘గేమ్ ఛేంజర్’ని భారీ హంగులతో తెరనిండా చూపించారు. డైరెక్టర్ శంకర్ మార్క్ సందేశం, విజువల్స్, భావోద్వేగా అనుసంధానం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను గుండెలకు హత్తుకునేలా మలిచిన తీరు శంకర్ తనలోని స్టామినాను మరోసారి చూపెట్టాడని అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ప్రేక్షకులను షాక్ ఇచ్చాడు. ఇక సెకండాఫ్‌లో అప్పన్న పాత్రే ఈ సినిమాకు ప్రాణం. ఆ పాత్రతోనే దర్శకుడు శంకర్ సోషల్ మెసేజ్ ఇచ్చాడు. అప్పన్న పాత్రను తీర్చిదిద్దిన తీరు, ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసిన తీరు చాలా బాగుందని ప్రేక్షకుడు చెబుతున్నారు.
అయితే ఏవో అద్భుతాలు ఉంటాయని ఆశించి.. గేమ్ ఛేంజర్ సినిమాకు వెళ్తే మాత్రం ప్రేక్షకులకు నిరాశ తప్పదు. కథ కూడా మూస పద్ధతిలోనే ఉంటుంది. ఇక దానికి తగ్గట్లు లాజిక్‌లు లేని చిత్ర విచిత్రాలు ఈ సినిమాలో చాలానే కనిపిస్తాయి. ముగింపు కూడా మరీ రొటీన్ గా ఉంది.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మైనింగ్‌పై అప్పన్న పోరాటం.. రాజకీయాల్లోకి ఎంట్రీ.. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాన్సెప్ట్‌తో ఎదురైన సవాళ్లు ప్రతి సవాళ్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అప్పన్న ఎపిసోడ్ ముగియగానే సినిమా గాడి తప్పింది. శానన సభ వ్యవస్థ, సీఎంల ఎంపిక నాటకీయంగా అనిపిస్తుంది.
ప్రతిపక్ష నాయకుడు వెళ్లి.. ఈవీఎంలను పగుల కొడుతుంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి ఫైట్లు చేయడం.. ఆ ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం నిజ జీవితానికి దూరంగా కనిపిస్తాయి. ఇక లాజిక్‌లతో సంబంధం లేకుండా కొన్ని మాస్ ఎలిమిమెంట్స్ ను కూడా నేలవిడిచి సాము చేసినట్టుగానే అనిపించాయి. రైల్వే ట్రాక్‌పై కట్టిపడేసిన వాళ్లను హెలికాప్టర్‌లో వచ్చి కట్లు కత్తితో తెంచే సీన్ లో మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ బోయపాటిని గుర్తుకు వస్తాడు. పాటల్లో కనిపించినంత క్రియేటివిటీ కథ, కథనాల్లో లోపించినట్లు అనిపిస్తుంది.
రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఇందులో మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు. అప్పన్న పాత్రలో పండించిన ఎమోషన్స్ చాలా కీలకం. విభిన్న గెటప్స్ లో చరణ్ ఆకట్టుకున్నాడు. తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్‌తో చరణ్ అందరినీ మెప్పించాడనే చెప్పాలి. ద్వితీయార్థంలో అంజలి పాత్ర హైలెట్ గా నిలిచింది. అప్పన్న భార్య పార్వతిగా స్టోరీని మలుపుతిప్పే పాత్రలో అంజలి చాలా బాగా మెప్పించింది . అంజలి కెరీర్ కు ఇదో గేమ్ ఛేంజింగ్. ఇక కియారా ‘దోప్’ అంటూ హీరో కోపాన్ని కంట్రోల్ చేసే గ్లామర్ డాల్ పాత్రలో మెరిసింది. పాటలకే పరిమితమైంది.
ముఖ్యమంత్రి పాత్రలో శ్రీకాంత్ కీ రోల్ ప్లే చేశాడు. విలనిజంలో ఎస్‌జే సూర్య తన విలక్షణ నటనతో మెస్మరైజ్ చేశాడు. ఎస్ జే సూర్య మేనరిజం సరి కొత్తగా ఉంటుంది. ఒక్క పాత్రలో చాలా వేరియేషన్స్ చూపించాడు. గుండు లుక్‌లో విలనిజం చాలా బాగా పండించాడు సూర్య. సైడ్ సత్యంగా సునీల్ నవ్వించే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. ఇక జయరాం, సముద్రఖని కీలక పాత్రల్లో మెప్పించారు. కమెడియన్లు బ్రహ్మానందం, పృథ్వీ, నరేష్, వెన్నెల కిషోర్, రఘుబాబు, శుభలేఖ సుధాకర్ ఇలా భారీ కాస్టింగ్‌ను దించేశారు. కానీ వాళ్ల కు అంతగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి.
ఇక శంకర్ చిత్రాలు సాంకేతికంగా హై స్టాండర్డ్స్‌లో ఉంటాయి. గేమ్ ఛేంజర్‌లో పాటల చిత్రీకరణ మాత్రం అదిరిపోయింది. జరగండి.. జరగండి పాటలో కనిపించే విలేజ్ సెట్ ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. దోప్ పాట కూడా భారీ సెట్‌తో తీర్చిదిద్దారు. నిర్మాత దిల్ రాజు పెట్టిన ప్రతీ పైసా తెరపై ప్రతీ ఫ్రేమ్ లో చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. శంకర్ విజన్, సెట్ వర్క్, వీఎఫ్ఎక్స్, తిరు కెమెరా వర్క్ అద్భుతంగా కుదిరాయి. మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. జనాల్ని పొల్యూట్ చేసే చేయి.. జెండాకి సెల్యూట్ చేయకూడదు లాంటి తదితర పొలిటికల్ డైలాగ్‌లు బాగా పేలాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరింది. రామ్ చరణ్ ఎలివేషన్స్ షాట్స్‌లో తమన్ ప్రాణం పెట్టేశాడు. అయితే పాటలు మాత్రం వినడానికన్నా చూడ్డానికి చాలా బాగున్నాయి. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇస్తాయి.
ఇక మొత్తంగా చూస్తే గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ కు మాత్రమే ‘రికార్డ్స్ ఛేంజర్’ అవ్వొచ్చు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ తన నటనకు మరోసారి పదును పెట్టాడు. అప్పన్న పాత్ర రామ్ చరణ్ కు అన్ ప్రిడక్టబుల్. సంక్రాంతి సెలవులు దిల్ రాజుకు సేఫ్ జోన్ లో నిలబెట్టవచ్చు.