- రామగుండం కమిషనరేట్ లో ప్రారంభించిన సీపీ శ్రీనివాస్
Feed Back : రాష్ట్రం లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుదారులు, బాధితులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది పని తీరు, ప్రవర్తన, స్పందించిన విధానం, పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు తమ అభిప్రాయం తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ పద్ధతిని డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు.
అనంతరం రామగుండం కమిషనరేట్ లో కమిషనర్ ఎం శ్రీనివాస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఈ క్యూఆర్ కోడ్ పోస్టర్లను పోలీస్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్ పోలీస్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కంటే తక్కువ కాకుండా క్యూ ఆర్ కోడ్ లు ఏర్పాటు చేయాలి. ప్రతి పోస్టర్ A3 సైజ్ లో ఉండాలి. పోలీస్ స్టేషన్ గేట్‌లోకి ప్రవేశించిన వెంటనే ప్రతి పౌరుడికి కనిపించేలా, పోలీస్ స్టేషన్ వెలుపల ఒక పోస్టర్ ఏర్పాటు చేయాలి. క్యూఆర్ కోడ్ పోస్టర్లు పాడవకుండా, చిరిగిన లేదా వెలిసిపోయిన లేదా దెబ్బతిన్న చోట వెంటనే కొత్తది ఏర్పాటు చేసే బాధ్యత ఎస్ హెచ్ఓదే. పోలీస్ స్టేషన్ తనిఖీ చేసే అధికారులు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ పోస్టర్‌లు కనిపించేలా, తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలి.
ప్రజలకు సులభంగా కనిపించే, సౌకర్యవంతమైన ప్రదేశాలు, ప్రధాన కూడళ్లు , జనసమీకరణ ఉన్నదే ప్రాంతాల్లో ఈ క్యూఆర్ కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేయాలి.
ప్రజలు, ఫిర్యాదుదారులు, బాధితులు తమ అభిప్రాయాన్ని ఈ QR కోడ్ ద్వారా సమర్పించే విధానాన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా తెలియజేసేందుకు కమిషనరేట్, డీసీపీ, ఏసీపీ, సర్కిల్, ప్రతి పోలీస్ స్టేషన్ వెబ్‌సైట్‌లు, ఫేస్ బుక్ పేజీలు, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్) పేజీల లో ఈ క్యూఆర్ కోడ్, దాని డైరెక్ట్ లింక్‌తో అప్‌డేట్‌లను అప్లోడ్ చేయాలని సూచించారు. క్యూఆర్ కోడ్ ఫీడ్‌బ్యాక్ పోస్టర్ గురించి డీసీపీలు, ఏసీపీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలని సూచించారు. క్యూఆర్ కోడ్ కు సంబంధించిన మెయింటెనెన్స్ గురించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లడారు. పోలీసులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ క్యూఆర్ కోడ్ పద్ధతి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పిటిషన్, ఎఫ్‌ఐఆర్, ఇ-చలాన్ , పాస్‌పోర్ట్ ధృవీకరణ, పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసు అధికారుల, సిబ్బంది ప్రతిస్పందన, ప్రవర్తనపై ప్రజలు, బాదితుల అభిప్రాయం నమోదు చేయనున్నట్లు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోస్టర్లు ప్రధాన కూడళ్ల వద్ద, జనరద్దీ గల ప్రదేశాలలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా పోలీసు సేవలపై పిటిషనర్లు, బాధితులు తమ అభిప్రాయాన్ని సులభంగా తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. పౌరులు ఈ క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్)సీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు,
సీఐలు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్, సీసీ ఆర్బీ ఇన్‌స్పెక్టర్ సతీష్, వివిధ విభాగాల ఇన్ స్పెక్టర్లు రవీందర్, చంద్రశేఖర్ గౌడ్, కృష్ణ , శ్రీధర్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఇన్‌స్పెక్టర్ రాంప్రసాద్, ఆర్ఐ దామోదర్, సీసీ హరీష్ ,ఐటి కోర్ రాము, తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల/గోదావరిఖని