Vishwambara: చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమా 2023 అక్టోబర్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. తొలుత ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నది. ఇప్పటిదాకా సరైన ప్రమోషన్ కూడా చేయలేదు. ఈ చిత్రం నుంచి కనీసం అప్డేట్ కూడా బయటికి రావడం లేదు. దీంతో అభిమానుల్లో అసహనం పెరిగిపోతోంది.
మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది ఇప్పటికీ స్పష్టతలేదు. తాజా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ ఏడాది ‘విశ్వంభర’ విడుదల కష్టమే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జులై, ఆగస్టు నెలల్లో రిలీజ్ పెట్టుకోకపోతే వచ్చే ఏడాది వేసవి తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదని ఫిలింనగర్ వర్గాల టాక్.
ఇప్పటివరకు విడుదలైన టీజర్‌లో గ్రాఫిక్స్‌కు సంబంధించి తీవ్ర విమర్శలు వచ్చాయి. వీఎఫ్‌ఎక్స్ పనులపై వచ్చిన ట్రోల్స్ ఈ సినిమాను మరింత వెనక్కి నెట్టాయి. ఈ నేపథ్యంలో దసరా సీజన్ లో విడుదల కుదిరేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ సమయంలో అఖండ 2, ఓజీ సినిమాలు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇక దీపావళికి ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ ను ప్రకటించుకున్నాయి. నవంబర్, డిసెంబర్‌లో విడుదల చేస్తే మరో సినిమాకు రిలీజ్ కు గ్యాప్ తక్కువగా ఉంటుంది. జనవరిలో చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా విడుదల డేట్ కూడా ప్రకటించారు. ఇప్పటికే జనవరి 10 విడుదల తేదీగా ఫిక్స్ అయింది.
ఒకే హీరో సినిమాలు తక్కువ గ్యాప్‌లో వస్తే మార్కెట్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలు తొందరపడిపోకుండా ముందస్తు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మెగా 157 సినిమా 2026 సంక్రాంతికి విడుదల అవుతుందనీ, దానికన్నా ముందే విశ్వంభర రావచ్చు అనే టాక్ వినిపిస్తు్న్నది.
టీజర్‌పై వచ్చిన విమర్శలతో దర్శకుడు వశిష్ఠ మరింత అప్రమత్తమయ్యారట. చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమాకు అవకాశం వచ్చినప్పుడు అది జీవితంలో వచ్చే అరుదైన ఛాన్స్ అని భావిస్తూ, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా పని చేస్తున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఆలస్యం అయినా సరే, మాస్-ఫ్యామిలీ ఆడియన్స్‌కి బిగ్ హిట్ అందించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
స్పెషల్ అట్రాక్షన్ గా మౌనీరాయ్
లేటెస్ట్ తాజా సమాచారం ప్రకారం విశ్వంభరలో ఓ మాస్ ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్ ను తీసుకున్నారని రూమర్లు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో ఇప్పటివరకు మేకర్స్ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఒకవేళ మౌనీరాయ్ ఐటెం సాంగ్ కు ఒప్పుకుంటే మాత్రం సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న మాట. పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండడంతో మౌనీరాయ్ సినిమాకు హెల్ప్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
శెనార్తి మీడియా, సినిమా డెస్క్