సీఎండీ ఎన్ బలరామ్
వచ్చే నెలలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి
Singareni CMD: మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాన్ని సోమవారం సాయంత్రం సింగరేణి సంస్థ కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అనుబంధ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) ద్వారా నిర్మించేందుకు అధికారికంగా ఒప్పందం జరిగిందని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారు.
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ (పీ అండ్ పీ) కె.వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఎస్.డి.ఎం.సుభానీ తదితరులు పాల్గొన్నారు. BHEL నుండి జనరల్ మేనేజర్ (జీఎం), హెడ్ పార్థసారథి దాస్, జీఎం జోగేష్ గులాటి హాజరయ్యారు.
- 40 నెలల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తిచేయాలి
ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 48 నెలల్లో (4 ఏళ్లలో) ప్లాంట్ నిర్మాణం పూర్తవ్వాలి కానీ, 40 నెలల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇందుకు అనుగుణంగా వచ్చే నెలలోనే పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం నిర్దేశించిన షెడ్యూల్లోనే పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రాంగణంలో అవసరమైన అన్ని వసతులు సిద్ధంగా ఉన్నందున వేగంగా నిర్మాణం చేపట్టాలని సూచించారు.
BHEL జీఎం అండ్ హెడ్ పార్థసారథి దాస్ మాట్లాడుతూ.. సింగరేణి పవర్ ప్లాంట్‌ను అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా బోర్డు నిర్ణయించిందని, వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో 1200 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణంలో ఎదురైన సవాళ్లను ముందుగానే గుర్తించి, ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు వెల్లడించారు.
- ప్లాంట్ పూర్తయితే సింగరేణికి ఏడాదికి రూ. 300 కోట్లు లాభం..
ఈ కొత్త 800 మెగావాట్ల ప్లాంట్‌కు BHEL సంస్థ బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్లు (BTG) ఏర్పాటుతో పాటు అన్ని రకాల సివిల్ నిర్మాణాలు చేపడుతుంది. ప్రస్తుత 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం 2016లో ప్రారంభమై విజయవంతంగా నడుస్తూ, కంపెనీకి ప్రతి ఏడాది రూ. 450 కోట్ల లాభాలు అందిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్లాంట్ 70,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలకు అందించింది.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (PLF) లో దేశవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలుస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, అదే ప్రాంగణంలో మరో యూనిట్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ప్లాంట్ పూర్తయిన తర్వాత సింగరేణి సంస్థకు ఏటా ₹300 కోట్ల లాభం వచ్చే అవకాశం ఉంది. ఇది సింగరేణి సంస్థ వృద్ధికి, రాష్ట్ర విద్యుత్ అవసరాల తీర్చడానికి కీలకంగా మారనుంది.
-శెనార్తి మీడియా, మంచిర్యాల